నాడు-నేడు పనులు వేగవంతం పెంచండి


Ens Balu
5
2022-10-13 15:13:11

పార్వతీపురం మన్యం జిల్లాలో నాడు - నేడు క్రింద రెండవ విడతలో చేపడుతున్న జూనియర్ కళాశాలలు, పాఠశాలల్లోని నిర్మాణ పనులు వేగవంతం చేయాలని  పాఠశాల విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం ఆయన సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు జి.శ్రీనివాసులు,పాఠశాల విద్య కమీషనర్ సురేష్ కుమార్, పాఠశాల వసతులకల్పన కమిషనర్ కె. భాస్కర్  లతో కలిసి   నాడు-నేడు రెండవ విడత కార్యక్రమం, అదనపు తరగతి గదులు నిర్మాణం, ప్రహరీ గోడలు, మౌలిక వసతుల కల్పన, రివాల్వింగ్ ఫండ్ జమ తదితర అంశాలపై  జిల్లా కలెక్టర్లు, జిల్లా విద్యా శాఖాధికారులు, సమగ్ర శిక్షణ అదనపు పథక సమన్వయకర్తలు, జిల్లా వృత్తి విద్యాశాఖాధికారులతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

నాడు- నేడు కార్యక్రమం క్రింద జిల్లాలో చేపడుతున్న  అదనపు తరగతి గదులు, ప్రహరీగోడల నిర్మాణాలు త్వరితగతిన పూర్తికావాలని అన్నారు.  నాణ్యత లోపం లేకుండ పారదర్శకంగా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. నిర్మాణ పనులకు నిధుల కొరత సమస్య లేకుండ చర్యలు తీసుకుంటామన్నారు.  వర్షాలు కారణంగా నిర్మాణ పనులు ప్రారంభమై పునాది స్థాయిలో తీసిన గుంతలు నీటితో నిండి ఉన్న చోట ప్రమాదాలు జరగకుండా రేడియం రిబ్బన్, బారికేడ్లను ఏర్పాటు చేసి భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. అదేవిధంగా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పాటశాలల్లో డ్రాపౌట్స్ ఉన్న చోట వాస్తవ పరిస్థితిని విచారించి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్  మాట్లాడుతూ జిల్లాలో నాడు - నేడు  నిర్మాణ పనుల పురోగతిని వివరించారు. సిమెంట్ కొరత కారణంగా నిర్మాణాలకు అవసరం మేరకు సిమెంట్ సరఫరా చేయాలని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా విద్యా శాఖ అధికారి డా.ఎస్.డి.వి.రమణ,  జిల్లా గ్రామీణ సరఫరా ఇంజనీరింగ్ అధికారి ఓ. ప్రభాకర్, జిల్లా వృత్తి విద్యా అధికారి డి.మంజుల వీణ, ఏ పి ఓ వై.శంకర్ రావు, సర్వ శిక్షా అభియాన్ డి ఈ డి.కిషోర్ కుమార్ ,గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారి శాంతిస్వర్, తదితరులు పాల్గొన్నారు.