పంచాయతీ రాజ్ శాఖ ద్వారా చేపడుతున్న నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తికావాలని పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం భవన నిర్మాణాలు, జల్ జీవన్ మిషన్, పారిశుద్ధ్యం తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల్లో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా చేపడుతున్న భవన నిర్మాణాల్లో మరింత పురోగతి కనబరచాలన్నారు. ఆయా శాఖాధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ప్రతి రోజు ప్రగతిని కనబరచేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. నిర్మాణాలకు అవసరమైన సిమెంట్, ఇసుక, ఇనుము అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
పనులు ఆలస్యమైన చోట కాంట్రాక్టర్లతో మాట్లాడి యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు. జల్ జీవన్ మిషన్ మంచి కార్యక్రమమని, ఈ కార్యక్రమంలో ఎటువంటి జాప్యం లేకుండా చూడాలన్నారు. ఎక్కడా పెండింగ్ లేకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శానిటేషన్ కాంప్లెక్స్ ల నిర్మాణ పనులు, పారిశుద్ధ్యం పనులు చురుకుగా సాగాలని, వీలైనంత త్వరగా పూర్తికావాలని ఆయన వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన అన్ని లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలని కలెక్టర్లను కోరారు. ఈ వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణాధికారి ఆర్.వెంకటరామన్, జిల్లా నీటియాజమాన్య సంస్థ పథక సంచాలకులు జి.వి.చిట్టిరాజు, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.