15లోగా మార్పులు, చేర్పులు జరగాలి


Ens Balu
3
2022-10-13 16:12:16

జగనన్న భూహక్కు - భూరక్ష పత్రాలలో మార్పులు చేర్పులు కోసం వన్ టైం ఎడిట్ మాడ్యూల్ ఆప్షన్ ఇవ్వడం జరిగిందని భూపరిపాలన ప్రధాన కార్యదర్శి మరియు ప్రత్యేక ముఖ్యకార్యదర్శి జి.సాయి ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం రీసర్వే , జగనన్న భూహక్కు - భూరక్ష పత్రాల మంజూరు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిసిఎల్ఏ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రీసర్వే దాదాపు పూర్తవుతుందని, సమగ్ర సర్వే పూర్తయిన గ్రామాల్లో భూహక్కుదారులకు జగనన్న భూహక్కు - భూరక్ష పత్రాల జారీకి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో సమగ్ర సర్వే పూర్తయిన 350 గ్రామాలకు భూహక్కు పత్రాలను పంపిణీచేయాల్సి ఉందని అన్నారు. 

భూహక్కు పత్రాలలో ప్రచురణే కొలమానం అయినందున పత్రాల జారీలో వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. పత్రాల జారీలో మార్పులు, చేర్పులు కొరకు అప్షన్ ఇవ్వడం జరిగిందన్నారు. కావున మార్పులు, చేర్పులు చేయాల్సినవి ఉంటే అటువంటి వాటిని ఈ నెల 15 లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. తమకు పంపిన వివరాలను అనుసరించి భూహక్కు-భూరక్ష పత్రాలు సిద్ధమవుతాయని, కావున ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా చూసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఎం.నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.రాజేశ్వరి, భూసర్వే మరియు రికార్డుల శాఖ సహాయ సంచాలకులు కె.ప్రభాకరరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.