ఉత్తరాంధ్ర అభివృద్ధి, భవిష్యత్ తరాల కోసం జగన్మోహన్ రెడ్డి విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని తీసుకున్న నిర్ణయానికి ఈ ప్రాంత ప్రజలందరూ మద్దతు పలకాలని, ఈ అవకాశాన్ని వదులుకోకూడదని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. శనివారం జరగనున్న విశాఖ గర్జన ఏర్పాట్లను అమర్నాథ్ శుక్రవారం ఉదయం పరిశీలించారు. స్థానిక ఎల్ఐసి కార్యాలయం సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి శనివారం ఉదయం 9 గంటలకు జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ తదితర ఉన్నతాధికారులతో కలసి అమర్నాథ్ పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శనివారం జరిగే ర్యాలీలో కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు, మహిళలు,వృద్ధులు పాల్గొని తమ ఆకాంక్షలను తెలియజేయనున్నారు అని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు తెలియ చేసే సమయం ఆసన్నమైందని, ఇప్పుడు మౌనంగా ఉంటే, మన భవిష్యత్ తరాలు తీవ్రంగా నష్టపోతాయని, అందుకే ఉత్తరాంధ్ర ప్రజలు గర్జనకు భారీగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. మన ప్రాంతo అభివృద్ధి చెందకూడదన్న దురుద్దేశంతో అమరావతి రైతులు దండయాత్రగా మనపైకి వస్తున్నారని వాళ్లు కళ్ళు తెరుచుకునేలా ఉత్తరాంధ్ర ప్రజలు బుద్ధి చెప్పాలని అమర్నాథ్ పిలుపునిచ్చారు.
ఇంట్లో సమస్యలు పరిష్కరించుకోండి..
గత కొద్ది రోజులుగా జన నాయకుడు పవన్ కళ్యాణ్ విశాఖ గర్జన మీద చేస్తున్న వ్యాఖ్యలను అమర్నాథ్ తిప్పికొట్టారు. పవన్ కళ్యాణ్ జనవాణి పేరుతో విశాఖ వస్తున్నారని, ముందు ఆయన ఇంట్లో సమస్యలను పరిష్కరించుకొని, ఆ తర్వాత జనం సమస్యల గురించి ఆలోచించాలని అమర్ నాథ్ విజ్ఞప్తి చేశారు. జనవాణికి తాను హాజరు అవుతానన్న ప్రచారాన్ని అమర్నాథ్ ఖండించారు. పవన్ కి ఏమైనా అవసరం ఉంటే నా దగ్గరికి రావాలి కానీ నేను ఆయన దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలను ఇప్పటివరకు పట్టించుకోని పవన్ కళ్యాణ్ కు అకస్మాత్తుగా ఈ ప్రాంత ప్రజలు ఎందుకు గుర్తుకు వచ్చారని ఆయన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ డబ్బులు ఎక్కువ వస్తాయని కాల్షీట్లను అమ్ముకుంటున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, వైసిపి రాష్ట్ర అదనపు కార్యదర్శి రవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.