దీపావళి సందర్భంగా బాణసంచా తయారీ, విక్రయాల్లో రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని.. ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని, కేసులు నమోదు చేయనున్నట్లు కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ స్పష్టం చేశారు. దీపావళి పండగ నేపథ్యంలో బాణసంచా తయారీ, విక్రయాలకు ఇచ్చే తాత్కాలిక లైసెన్సులు, విక్రయాల సందర్భంగా దుకాణ యజమానులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వివిధ సమన్వయ శాఖల తనిఖీలు తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ ఇలక్కియ శుక్రవారం వర్చువల్‌గా రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ, కార్మిక, మున్సిపల్, పంచాయతీరాజ్, ఆరోగ్య తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ నెల 23, 24వ తేదీల్లో రెండు రోజుల పాటు మాత్రమే బాణసంచా విక్రయాలకు అనుమతి ఉంటుందని.. విక్రయాల కోసం వచ్చే ప్రతి దరఖాస్తును క్షుణ్నంగా పరిశీలించి ఆర్‌డీవోలు అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విక్రయాలు జరపొచ్చన్నారు. దుకాణాలు ఏర్పాటుచేసేందుకు అనువైన స్థలాలను గుర్తించి.. విక్రయాలు సజావుగా సాగేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. దుకాణానికి దుకాణానికి మధ్య కచ్చితంగా మూడు మీటర్ల దూరం ఉండాలని.. ఒక క్లస్టర్‌లో గరిష్టంగా 50 దుకాణాలు మాత్రమే ఏర్పాటు చేసేందుకు అవకాశముందన్నారు. అధికారులు మార్కు చేసి ఇచ్చిన చోట మాత్రమే దుకాణాలు ఏర్పాటుచేసుకోవాల్సి ఉంటుందన్నారు. అగ్నిమాపక వాహనాలు, అంబులెన్సులు వంటివి వచ్చి వెళ్లేందుకు అనువుగా రహదారులు ఉండేలా చూడాలన్నారు.
విక్రయాలు జరిపే చోట అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోకుండా పటిష్ట జాగ్రత్తలు తీసుకోవాలని.. ప్రతి షాపు వద్ద ఇసుక బకెట్లు, డ్రమ్ములతో నీరు వంటివి ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రతి దుకాణం వద్ద నో స్మోక్ బోర్డులు ఏర్పాటుచేయాలన్నారు. డివిజన్, మండలస్థాయిలో ప్రత్యేక తనిఖీ బృందాలు ఏర్పాటుచేయాలని.. రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బాణసంచా తయారీ, విక్రయ కేంద్రాల్లో చిన్నపిల్లలను పనిలో పెట్టకూడదని.. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. రాత్రి పది గంటల తర్వాత ప్రజలు ఎవరూ శబ్దం వచ్చే బాణసంచా ఉపయోగించకూడదని జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ వెల్లడించారు. ప్రజా ప్రయోజనాల కోసం నిర్దేశించిన ఈ నిబంధలను పాటిస్తూ ప్రజలు ఆనందోత్సాహాలతో పండగ జరుపుకోవాలని సూచించారు. సమావేశంలో కాకినాడ ఆర్‌డీవో బీవీ రమణ, పెద్దాపురం ఆర్‌డీవో జె.సీతారామారావు, ఇన్‌ఛార్జ్ డీపీవో ఎ.వెంకటలక్ష్మి, జిల్లా అగ్నిమాపక అధికారి ఎన్.సురేంద్ర, వివిధ మున్సిపాలిటీల కమిషనర్లు, మండలాల తహసీల్దార్లు, పోలీస్, విపత్తు నిర్వహణ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.