ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు వేగవంతం చేయాలి


Ens Balu
20
2022-10-14 11:06:56

పట్టభద్రుల  నియోజకవర్గ  ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో బాగంగా వచ్చిన దరఖాస్తులలో పెండింగ్ ఉన్నవాటిని సత్వరమే పరిశీలించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి  ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. శుక్రవారం ఉదయం అన్ని జిల్లాల ఈఆర్ఓ లు మరియ ఏఈఆర్ఓ లతో నమోదు ప్రక్రియ పై వీడియో కాన్ఫెరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి  మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన పట్టభద్రులు అందరు నవంబర్ 7వ తేదీ లోగా కొత్తగా ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలన్నారు. శాసనసభ నియోజక వర్గాల పరిధిలో ఉండవలసిన ఓటర్ల శాతం 75 కంటే అధికంగా ఉంటే ఓటర్ల వివరాలను మరోమారు క్షుణ్ణంగా పరిశీలించి తప్పులను సరిచేయాలని, అలాగే తక్కువ ఓటర్లు నమోదైన చోట మరోసారి ఓటర్ల వివరాలు సేకరించాలని ఆదేశించారు. 

  ఇప్పటికే పోలింగ్ స్టేషన్ల వివరాలు, ఓటర్ల మార్పు చేర్పులు చేసుకోవడానికి గరుడ్ యాప్ ను ఇవ్వడం జరిగిందని, ఈ యాప్ వినియోగంపై  బూతు లెవెల్ అధికారులకు (బి.యల్.ఓ) పూర్తి అవగాహన ఉండాలన్నారు. కొత్తగా వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు బి.యల్.ఓ ల ద్వారా పరిశీలించి, ఆన్లైన్ లో నమోదు చేయాలని సూచించారు.  వాలంటీర్లు ఓటర్ల నమోదు ప్రక్రియలో పాల్గొనరాదని, వారు పాల్గొన్నట్లు ఫిర్యాదులు అందితే విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సు లో జిల్లా నుండి  డిఆర్వో శ్రీనివాసమూర్తి, వియంఆర్డీఏ ఎస్టేట్ అధికారి లక్ష్మా రెడ్డి , స్పెషల్ డిప్యూటీ కలెక్టరు ఎన్ హెచ్ -16 వెంకటేశ్వర రావు, ఎన్నికల డిప్యూటి తహసీల్దారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.