ప్రభుత్వ నిర్మాణాలు వేగవంతం చేయాలి


Ens Balu
6
2022-10-14 11:14:23

నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్న గృహాలు, ప్రభుత్వ శాశ్వత భవనాల పనులపై ప్రత్యేక దృష్టిసారించి వినియోగంలో తీసుకు వచ్చే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టరు డా కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కాకినాడ కలెక్టరేట్ లో కాకినాడ, పెద్దాపురం డివిజన్ పరిధిలోని హౌసింగ్, పీఆర్ బిల్డింగ్స్, హౌసింగ్ లేఔట్లు, అప్రోచ్ రోడ్లు, ఎస్ డబ్ల్యూ పిసి, ఎస్.హెచ్. జీ రుణాలు మంజూరు, తదితర అంశాలపై జిల్లా కలెక్టరు కృతికా శుక్లా.. హౌసింగ్, డ్వామా, ఆర్డబ్ల్యూఎస్ ఇతర జిల్లా అధికారులతో పాటు కాకినాడ, పెద్దాపురం డివిజన్లు వారిగా అన్ని మండలాల తహసిల్దార్లు, ఎంపీడీవో హౌసింగ్, పీఆర్ ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

 ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద చేపట్టిన గృహ నిర్మాణాలతో పాటు ప్రభుత్వ శాశ్వత భవనాలైన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనాలు ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్న వాటిని నెల రోజులలో మిగిలిన పనులు పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా చూడాలన్నారు. గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ కార్యదర్శులు హౌసింగ్ కు సంబంధించిన స్టేజ్ కన్వర్షన్ వివరాలు యాప్ లో సక్రమంగా నమోదు చేయాలన్నారు. గ్రామాల్లో ఎస్.డబ్ల్యూ.పిసి కేంద్రాల ద్వారా వర్మి కంపోస్ట్ తయారీకి చర్యలు చేపట్టాలన్నారు.

 ముఖ్యంగా  రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అనుసరించి నవంబర్ 1 నుంచి అమలు చేయనున్న  ప్లేక్సీల నిషేధంపై గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని, ఇప్పటికే క్షేత్రస్థాయి ప్రభుత్వ కార్యాలయలలో ఉన్న ప్లేక్సీల తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టరు అధికారులకు స్పష్టం చేశారు. సమావేశంలో హౌసింగ్ పీడీ బి సుధాకర్ పట్నాయక్, డ్వామా పీడీ ఇంచార్జ్ డీపీఓ ఎ.వెంకటలక్ష్మి, కాకినాడ పెద్దాపురం డీఎల్డీవోలు పి.నారాయణ మూర్తి, కె.ఎన్.వి ప్రసాదు రావు హౌసింగ్, పీఆర్  డీఈ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.