వచ్చే ఏడది నుంచి రాష్ట్రమంతా ఫోర్టిపైడ్ బియ్యం


Ens Balu
14
2022-10-14 12:27:27

పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్ విజయ్ ప్రతాప్ రెడ్డి ఐసిడిఎస్, పౌర సరఫరాలు, విద్య, గిరిజన సంక్షేమ శాఖాదికారులను ఆదేశించారు.  శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయా శాఖల అధికారులతో సమీక్షించిన చైర్మన్ మాట్లాడుతూ, వచ్చే ఏడాది మే నెల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఫోర్టిపైడ్ బియ్యం పంపిణీ చేస్తామని స్పష్టం చేసారు.  గత రెండు రోజులుగా జిల్లాలో పర్యటించిన కమిషన్ చైర్మన్ అనంతగిరి, అరకు, దుంబ్రిగుడ, పాడేరు మండలాలలోని 30 కేంద్రాలు (ఎం.ఎల్.ఎస్ పాయింట్లు, చౌక దుకాణాలు, అంగన్వాడి కేంద్రాలు, సంచార పంపిణీ వాహనాలు, పాటశాలలు, వసతి గృహాలు) సందర్శించి లోటుపాట్లను గుర్తించి తగు సూచనలు జారీ చేసామని తెలిపారు. ఇంతవరకు రాష్ట్రవ్యాప్తంగా 366 కేంద్రాలు సందర్శించి కొన్ని కేంద్రాలపై చర్యలు కుడా తీసుకున్నామని స్పష్టం చేసారు. 

జిల్లాలో శాఖ తరుపున చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పట్ల అవగాహన పెంపొందించుకోవాలని, జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని, సమస్యలు పరిష్కరించుకుంటూ నాణ్యమైన ఆహార పదార్ధాలు అందించాలని, కమీషన్ లక్ష్యంగా పెట్టుకుందని,  ఆ దిశలో అందరూ పనిచేయాలని స్పష్టం చేసిన కమిషనర్ అలసత్వాన్ని, నాణ్యతా లేమిని సహించేది లేదని, అటువంటి వారిపై చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు.  సమస్యలను. అర్ధం చేసుకోవటమే కాకుండా సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు. అంగన్వాడి వర్కర్ల నిరక్షరాస్యత వల్ల కొన్ని కేంద్రాలలో తగు న్యాయం జరగటం లేనట్లు గుర్తించామని, అటువంటి కేంద్రాలపై మరింత ద్రుష్టి సారించాలని సూచించారు.  హాజరు నమోదులో, నాణ్యతలో రాజీ లేకుండా ఖచ్చితమైన కొలతలతో ఆహారాన్ని పెట్టాలని ఆదేశించారు.  ఆహార వస్తువులు, గుడ్లు, పప్పులు, నూనేలపై గడువు తేదీ పరిశీలించాలని కోరారు.  సిడిపిఓలు క్రమం తప్పకుండ కేంద్రాలను సందర్శించాలని ఆదేశించారు.

మధ్యాహ్న భోజనంలో మెనూ తప్పనిసరిగా పాటించాలని, ఫోర్టిపైడ్ బియ్యం గూర్చి అవగాహన కల్పించాలని చైర్మన్ ఆదేశించారు.  పిల్లలకు బలమైన ఆహరం అందించటానికి విటమిన్లు, ఐరన్ కలిపి తయారు చేసిన ఫోర్టిపైడ్ బియ్యం ప్రతి కిలోకు 50 గ్రాములు అందిస్తున్నామని వివరించారు.  రాష్ట్రంలో అన్ని అంగన్వాడి,  విధ్యాసంస్థలతో పాటు ఏడు జిల్లాలలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఫోర్టిపైడ్ బియ్యం సరఫరా చేస్తున్నామన్నారు.  పిల్లలే కదా ఎదో ఒకటి పెడదామని ఆలోచించకుండా వారికి పౌష్టికాహారం అందించాలని, వాళ్ళ హక్కులను కాలరాసే ప్రయత్నిస్తే తీవ్రంగా పరిగణించి చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు.  ఇటీవల పాడేరు కెజిబివి విద్యార్ధులు ఆహరం సరిగా అందించటం లేనందున ధర్నా చేసినట్లు, ఒక్క చికెన్ ముక్క మాత్రమె వేస్తున్నారని మెసేజ్లు వచ్చాయని తెలిపారు.  

ఆహార పంపిణీలో నాణ్యత, పరిమాణం లో తేడాలు ఉంటే 94905 51117 నంబర్కు వాట్సాప్ ద్వారా తెలియజేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. జాతీయ స్థాయిలో ఎపి ఫుడ్ కమిషన్ మూడవ స్థానంలో ఉందని,  దానిని మొదటి స్తానంకు తీసుకు రావటానికి చేస్తున్న కృషిలో అందరూ సహకరించాలని కమిషన్ చైర్మన్ విజ్ఞప్తి చేసారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ,  ఫుడ్ కమిషన్ చైర్మన్ జిల్లాకు రావటం సంతోసకరమని,  వారి సందర్శనలో గుర్తించిన లోపాలను సరి చేస్తామన్నారు.  జిల్లాలొ భౌగోళికంగా ప్రత్యెక పరిస్థితులు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ నాణ్యమైన సేవలు అందించటానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని చైర్మన్ కు తెలిపారు. కమిషన్ సూచనలను, సలహాలను అమలు చేస్తామన్నారు. 

జేసి శివ శ్రీనివాసు మాట్లాడుతూ పౌర సరఫరాలు, అంగన్వాడి, మధ్యాహ్న భోజనం అమలు పై ప్రత్యెక దృష్టి సారిస్తామని, పంపిణీ సక్రమంగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని అందుకు మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తామని తెలిపారు.  సంచార పంపిణీ వాహనాలు ఎత్తైన కొండ ప్రాంతాలకు వెళ్ళటం ఇబ్బందిగా ఉందని, సిగ్నల్ సమస్య కూడా ఉందని చైర్మన్ దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్, ఐటిడిఎ ఇంచార్జ్ ప్రాజెక్ట్ అధికారి వి. అభిషేక్, పౌర సరఫరాల ఉప సంచాలకులు సురేష్, జిల్లా పౌర సరఫరా అధికారి శివ ప్రసాద్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ గణేష్ కుమార్, ఐసిడిఎస్ పధక సంచాలకులు సూర్య లక్ష్మి, జిల్లా విద్యాశాఖాధికారి డా. పి. రమేష్, డిఎంహెచ్ ఓ డా. బి. సుజాత, ఎటిడబ్ల్యుఓ ఎల్. రజని, సిడిపిఓలు, ఎంఇఓలు, తదితరులు పాల్గొన్నారు.