జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికీ అందించే మంచినీటి విషయంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని కాకినాడ ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ కోర్టుహాల్‌లో జల్ జీవన్ మిషన్‌పై కలెక్టర్ డా. కృతికా శుక్లా అధ్యక్షతన జిల్లా జల, పారిశుద్ధ్య మిషన్ (డీడబ్ల్యూఎస్ఎం) సమావేశం జరిగింది. జిల్లాలో జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన పనులు, వాటిలో పురోగతి తదితర అంశాలపై గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, డ్వామా, వ్యవసాయం, విద్య, విద్యుత్ తదితర సంస్థల అధికారులతో సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ వంగా గీత మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయిని అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో అమలవుతున్న జల్ జీవన్ మిషన్-హర్ ఘర్ జల్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గ్రామస్థాయి నీరు, పారిశుద్ధ్య కమిటీలు కీలకపాత్ర పోషించాలని పేర్కొన్నారు. గ్రామ సభలు నిర్వహించి గ్రామస్థాయి ప్రణాళికలు, నీటి నాణ్యత పరీక్షలు, పర్యవేక్షణ, ప్రజా భాగస్వామ్యం తదితర అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం, సమన్వయంతో మిషన్‌లో పురోగతికి కృషిచేయాలన్నారు. ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీటిని అందించి.. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం జల్ జీవన్ మిషన్ లక్ష్యమని ఎంపీ పేర్కొన్నారు.
పనుల వేగవంతానికి చర్యలు: కలెక్టర్ డా. కృతికా శుక్లా
కలెక్టర్ డా. కృతికా శుక్లా మాట్లాడుతూ జిల్లాలో జల్ జీవన్ మిషన్ కింద రూ. 245 కోట్ల అంచనాలతో 565 పనులు మంజూరయ్యాయని తెలిపారు. ఇప్పటికే 148 పనులు పూర్తికాగా మిగిలిన పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. వారం వారీగా లక్ష్యాలను నిర్దేశించుకొని పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. కొత్తగా 104 ఆవాసాలకు సంబంధించిన పనులకు ప్రతిపాదనలు రూపొందించినట్లు వెల్లడించారు. ఇప్పటికే జిల్లాలో 30 గ్రామాలను హర్ ఘర్ జల్ గ్రామాలుగా ప్రకటించినట్లు వివరించారు. కుళాయి కనెక్షన్ ఇవ్వడం ఎంత ముఖ్యమో ఆ కనెక్షన్ ద్వారా అత్యంత నాణ్యమైన మంచినీటిని అందించడం అంతకంటే ముఖ్యమని.. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మార్గదర్శకాలకు అనుగుణంగా సోర్స్, ట్యాప్ శాంపిళ్లను తీసుకొని పరీక్షలు నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గ్రామ పంచాయతీలకు అందించిన ఫీల్డ్ టెస్ట్ కిట్లు (ఎఫ్‌టీకే) ద్వారా పీహెచ్, కాఠిన్యత, ఆల్కలినిటీ, క్లోరైడ్ తదితర పరామితులను పరీక్షిస్తున్నట్లు వివరించారు. ప్రజారోగ్యంతో ముడిపడిన నీటి పరీక్షల విషయంలో అప్రమత్తతతో వ్యవహరించాలని కలెక్టర్ కృతికాశుక్లా అధికారులను ఆదేశించారు. సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా ఎస్ఈ ఎం.శ్రీనివాస్; డ్వామా పీడీ, డీపీవో ఎ.వెంకటలక్ష్మి, డీఈవో డి.సుభద్ర, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీరమణి, ఐసీడీఎస్ పీడీ కె.ప్రవీణ, డీఎంహెచ్‌వో డా. ఎం.శాంతిప్రభ తదితరులు హాజరయ్యారు.