యువతకు ఉద్యోగాలను కల్పించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని డిప్యుటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. దీనిలో భాగంగానే ప్రతీ నియోజకవర్గంలో జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరుగుతోందని చెప్పారు. జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్థ, డిఆర్‌డిఏ-సీడాప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తొలి మెగా జాబ్ మేళాను విజయనగరం పట్టణంలోని కస్పా ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కోలగట్ల మాట్లాడుతూ, ఎటువంటి సిఫార్సులకు తావులేకుండా, అత్యంత పారదర్శకంగా, ప్రతిభ ఉన్నవారికే ఉద్యోగాలను కల్పించడం జరుగుతోందన్నారు. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి, సుమారు లక్షా, 16వేల మందికి శాశ్వత ఉద్యోగాలను కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డికే దక్కిందన్నారు. అలాగే వివిధ ప్రయివేటు సంస్థల్లో ఉద్యోగాలను కల్పించేందుకు, ప్రతీ నియోజకవర్గంలో జాబ్ మేళాలను ఏర్పాటు చేయడం జరుగుతోందని చెప్పారు. ఏ ప్రాంతంలో ఉద్యోగం వచ్చినా వెళ్లి చేరాలని, ఉత్సాహం, ధైర్యం, నమ్మకంతో యువత ముందడుగు వేయాలని కోలగట్ల కోరారు.
జెడ్‌పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, నిరుద్యోగ సమస్య నిర్మూళన కోసం ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి జాబ్ మేళాలతో మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. దీనికోసం ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణా సంస్థను ఏర్పాటు చేసి, యువతకు విరివిగా ఉద్యోగాలను కల్పిస్తున్నారని చెప్పారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, వచ్చిన ఉద్యోగంలో చేరాలని సూచించారు. దగ్గరలోనే ఉద్యోగం రావాలని ఎదురుచూడకుండా, ఎక్కడ ఉద్యోగం వచ్చినా వెళ్లాలని, ఆ అనుభవం తరువాత మరింత మంచి ఉద్యోగాన్ని పొందేందుకు సహాయ పడుతుందని సూచించారు. వివిధ ప్రయివేటు కంపెనీల్లో మహిళలకు కూడా ఉద్యోగవకశాలను కల్పించాలని, కంపెనీలను ఛైర్మన్ కోరారు.
ఎంపి బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా, స్థానికులకే 70శాతం ఉద్యోగాలు కల్పించాలన్న నిర్ణయానికి ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి కట్టుబడి ఉన్నారని చెప్పారు. ఎటువంటి సిఫార్సు లేకుండానే, అర్హతను బట్టి ఉద్యోగాలు లభిస్తున్నాయని చెప్పారు. యువత తమ ప్రతిభను నిరూపించుకొని, అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ఎంఎల్‌సి పెనుమత్స సురేష్‌బాబు, మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఆర్.శ్రీరాములనాయుడు, డిఆర్‌డిఏ పిడి ఎ.కల్యాణచక్రవర్తి, జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి డాక్టర్ ఎన్.గోవిందరావు, జిల్లా ఉపాధికల్పనాధికారి అరుణ, వివిధ కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
542 మందికి ఉద్యోగాలు
కస్పా ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలను 542 మందికి ఉద్యోగాలు లభించాయి. మొత్తం 23 కంపెనీలు ఈ జాబ్ మేళాకు వచ్చి, అభ్యర్థుల అర్హతలను పరిశీలించారు. మొత్తం 2590 మంది యువతీయువకులు జాబ్ మేళాకు హాజరయ్యారు. వీరిలో 573 మందిని షార్ట్ లిస్టు చేయగా, వీరిలో 542 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసినట్లు, జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఎన్.గోవిందరావు తెలిపారు.