విజయనగరంలో 3రోజు 78.32% హాజరు..
Ens Balu
3
Vizianagaram
2020-09-22 18:28:02
విజయనగరం జిల్లాలో గ్రామ సచివాలయ ఉద్యోగ నియామక రాతపరీక్షలు ప్రశాంతంగా, సజావుగా జరుగుతున్నట్టు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ వెల్లడిం చారు. జిల్లా కేంద్రంలోని గాజులరేగ వద్ద వున్న సత్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ పరీక్షా కేంద్రంలో మూడో రోజు పరీక్షలు జరుగుతున్న తీరును కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. కళాశాలలో ప్రవేశించే రిసెప్షన్ కేంద్రం వద్ద అభ్యర్ధులందరినీ శానిటైజ్ చేస్తున్నదీ లేనిదీ అడిగి తెలుసుకున్నారు. ఆయా పరీక్షలు జరిగే తరగతి గదుల్లోనూ ఇన్విజిలేటర్లను ప్రశ్నించి అందరి వద్ద శానిటైజ్ బాటిళ్లు వున్నదీ లేనిదీ పరిశీలించి అందరికీ శానిటైజ్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాలలో పరీక్షలకు ఎంతమంది హాజరయ్యిందీ వివరాలను చీఫ్ సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో సచివాలయ ఉద్యోగ నియామక రాతపరీక్షలన్నీ కోవిడ్ నిబంధనలు పూర్తిగా పాటిస్తూ నిర్వహిస్తున్నామని, పరీక్షలు రాసే అభ్యర్ధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కనీస వసతులు కల్పించామని చెప్పారు. మూడో రోజు ఉదయం జరిగిన పరీక్షకు మొత్తం 2482 మంది అభ్యర్ధులకుగాను 1811 మంది హాజరయ్యారని, 72.97 శాతం హాజరు నమోదైనట్టు కలెక్టర్ పేర్కొన్నారు. ఒక పరీక్షా కేంద్రంలో పాజిటివ్ లక్షణాలున్న అభ్యర్ధి ఒకరు ఐసోలేషన్ గదిలో పరీక్షలు రాసినట్టు పేర్కొన్నారు. 671 మంది గైర్హాజరైన ట్టు తెలిపారు. మూడో రోజు మధ్యాహ్నం జరిగిన పరీక్షకు మొత్తం 1204 మంది అభ్యర్ధులకు గాను 943 మంది హాజరయ్యారని, 78.32శాతం హాజరు నమోదైనట్టు పేర్కొన్నారు. మధ్యాహ్నం ఐసోలేషన్ గదుల్లో ఏ ఒక్కరూ పరీక్ష రాయలేదని తెలిపారు. 261 మంది గైర్హాజరు అయినట్టు పేర్కొన్నారు.