విజయనగరం జిల్లాలో మైనింగ్ క్వారీలకు త్వరితంగా అనుమతులు మంజూరు చేస్తే తమకు ప్రయోజనం కలగడంతో పాటు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వీటి ద్వారా సమకూరుతుందని జిల్లాకు చెందిన పలువురు క్వారీ యాజమానులు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మైనింగ్ క్వారీలకు అనుమతుల మంజూరుకు సంబంధించి పర్యావరణ అనుమతుల మంజూరులో జాప్యం వల్ల కొన్నేళ్లుగా తాము ఇబ్బందులు పడుతున్నట్టు వివరించారు. జిల్లాలో 110 క్వారీలు వున్నాయని, వీటిలో ప్రభుత్వం పర్యావరణ అనుమతుల మంజూరులో నిబంధనలు సడలిస్తే వంద క్వారీలు మళ్లీ ప్రారంభం అవుతాయనీ వారు పేర్కొన్నారు. మైనింగ్ క్వారీ యాజమానులు నివేదించిన అంశాలను, వారి సమస్యలను సావధానంగా ఆలకించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి మాట్లాడుతూ ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అనుమతుల మంజూరులో నిబంధనలు మరింత సరళతరం చేసే దిశగా ప్రయత్నిస్తామని చెప్పారు. జిల్లాలో 96 రోడ్ మెటల్, 9 క్వార్ట జైట్, 5 గ్రానైట్ క్వారీలు నాన్ ఆపరేటింగ్ గా వున్నాయని గనుల శాఖ అధికారులు వివరించారు. సమావేశంలో గనుల శాఖ డి.డి. బాలాజీ నాయక్, ఏ.డి. ఎస్.పి.కె. మల్లేశ్వర రావు, పర్యావరణ ఇంజినీర్ సుదర్శనం తదితరులు పాల్గొన్నారు.