ఆశావాహ జిల్లాగా అనకాపల్లికి గుర్తింపు


Ens Balu
8
2022-10-14 14:12:53

కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి ఆశావహ జిల్లాగా అనకాపల్లి జిల్లాను గుర్తించిందని కేంద్ర విదేశాంగ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వి.మురళీధరన్ తెలిపారు.  శుక్రవారం పెంటకోట కన్వెన్షన్స్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల లబ్ధిదారుల స్పందనపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ మార్గదర్శకంలో కేంద్ర ప్రభుత్వం భారత ప్రజల సర్వతోముఖ అభివృద్ధికి అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. "సబ్ కే సాత్ సబ్ కా కళ్యాణ్" అందరితో కలిసి అందరి అభివృద్ధికి కృషి చేయడం అనే భావనతో వెనకబడిన ప్రాంతాలు, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. వాటిని మరింత ప్రభావవంతంగా అందించేందుకే కృషి చేస్తున్నట్లు తెలిపారు. 

ప్రస్తుతం ప్రపంచంలో ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఐదవ స్థానంలో మన దేశం ఉందని చెప్పారు. రూ.లక్షా 70 వేల తలసరి ఆదాయం తో ఉన్నామని అయితే అమెరికా వంటి దేశాల్లో దీని కంటే పది రెట్లు తలసరి ఆదాయం నమోదైందన్నారు.  దేశ తలసరి ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. స్వాతంత్ర్య సంగ్రామం చేసిన మన పూర్వుల ఆశలు ఆకాంక్షలను చేరుకునే క్రమంలో దేశం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో ముందుకు వెళ్లేందుకు మనం కృషి చేయాలన్నారు. దేశ గౌరవం, ఆత్మాభిమానం నిలబెట్టుకోవాలి అన్నారు. దేశం పూర్తిగా అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా ఐదు అంశాలలో ముందుకు పోవాలని చెప్పారు. రవాణా మార్గాలు,  పరిశ్రమలు, గ్రామాల్లో సైతం పట్టణ సౌకర్యాలు, ఎగుమతుల దిశగా వ్యవసాయ రంగం, శత శాతం అక్షరాస్యత, వైద్యం ఉండాలనే లక్ష్యంతో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. 

అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బి. వి. సత్యవతి మాట్లాడుతూ మాతృ యోజన పథకం దేశంలో తల్లులకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. మాతృ మరణాల రేటు గణనీయంగా తగ్గిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 3 వైద్య కళాశాలలో 1 అనకాపల్లికి దక్కిందని తెలిపారు. చారిత్రక ప్రదేశం అయిన బొజ్జన్నకొండ అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని, అనకాపల్లికి కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయాలని మంత్రిని కోరారు. జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి మాట్లాడుతూ జిల్లా భౌగోళిక సామాజిక ఆర్థిక రంగాలను గూర్చి తెలియజేశారు.  జిల్లా ప్రధానంగా వ్యవసాయ ప్రాంతమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల అమలు గూర్చి వివరించారు.

అంతకుముందు వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలను పొందిన లబ్ధిదారులు తమకు సదరు పథకాల మూలంగా ఏ విధమైన లబ్ధి జరిగింది, ఆర్థికంగా సమృద్ధి సాధించిన విధానాన్ని గూర్చి తెలియజేశారు. అనంతరం మంత్రి మురళీధర్ ను కలెక్టర్ సత్కరించి నూకాలమ్మ అమ్మవారి చిత్రపటాన్ని  బహూకరించారు. ఈ సమావేశంలో శాసనమండలి సభ్యులు పి.వీ. మాధవ్, చిన్న మధ్య తరహా పరిశ్రమల సంస్థ డైరెక్టర్ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, జిల్లా రెవిన్యూ అధికారి పి.వెంకట రమణ వివిధ శాఖల జిల్లా అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు.