భారత మాజీ రాష్ట్రపతి ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ నేటి తరానికి ఒక మార్గదర్శి అని జిల్లా కలెక్టర్ శ్రీ లాఠకర్ పేర్కొన్నారు. శనివారం స్థానిక పొన్నాడ వంతెన వద్ద గల మహాత్మా జ్యోతిరావు పూలే పార్కులో దివంగత మాజీ రాష్ట్రపతి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొని అబ్దుల్ కలామ్ విగ్రహానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అబ్దుల్ కలామ్ దేశానికే గర్వకారణమని, నేటి తరానికి ఒక మార్గదర్శి అని కొనియాడారు. రాష్ట్రపతి పదవికి ముందే దేశం కోసం ఆయన అందించిన సేవలు అనిర్వచనీయమని తెలిపారు. ఆర్మీ, పృద్వి వంటి మిస్సైల్స్ తో పాటు మొత్తం మిస్సైల్స్ రంగంలోనే దేశానికి ఆయన అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు. ఆయనకు పిల్లలన్న, విద్యార్థులన్న మక్కువ అని, వారితో పాటు కళాశాల విద్యార్థులతో ముచ్చటిస్తూ ఉండేవారని అన్నారు.
కలామ్ రచించిన ఇగ్నిటెడ్ మైండ్స్, వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇండియా 2020 రచనలు పాత, కొత్త తరానికి కూడా చైతన్యం వస్తుందని తెలిపారు. అబ్దుల్ కలామ్ గొప్ప రాష్ట్రపతి , శాస్త్రవేత్త, సామాజిక కర్త అని అటువంటి మహనీయుని జయంతిని నిర్వహించుకోవడం ఆనందదాయకమన్నారు. ఆయన చూపిన బాట అందరికి మార్గదర్శకమని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనలో పాలుపంచుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా ప్రజలకు, యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిట్టా చంద్రపతిరావు అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరమ్ జిల్లా అధ్యక్షులు కంఠ వేణు, శ్రీకాకుళం తాహాసిల్దార్ ఎన్ వెంకట్రావు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి బుడుమూరు రాజేష్, విగ్రహ దాత నక్క శంకర్రావు , గుత్తు చిన్నారావు పిట్ట భాగ్యచందర్రావు వంజరాపు రాజులు, కర్రీ రంగాజీ దేవ్, దేశల్ల మల్లిబాబు ఎల్ అనంతరావు, లండ అప్పన్న తదితరులు పాల్గొన్నారు.