నీటి వసతులను పరిరక్షించుకోవాలి


Ens Balu
6
2022-10-15 09:08:00

పార్వతీపురం మన్యం జిల్లాలో నీటి వసతుల రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. శనివారం  పార్వతీపురం కలెక్టరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టణం, దాని చుట్టు ప్రక్కల ఉన్న నీటి వసతుల ప్రాదాన్యత మరింత ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. పెద్ద నగరాలు, పట్టణాలు  వరదల సమయంలో ముంపుకు గురి కావడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే గత రెండు వారాలుగా ప్రత్యేక బృందాలు సర్వే చేపట్టి పలు చెరువులు, బందలు గుర్తించడం జరిగిందని వివరించారు. భవిష్యత్తులో పార్వతీపురం పట్టణం వరదలకు గురి కాకుండా ఉండుటకు వీటి పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఉన్నత న్యాయస్థానం, ప్రభుత్వం  చెరువుల పరిరక్షణపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని ఆయన చెప్పారు. 

బాల గొడబలో లెంకల చెరువు, పార్వతీపురంలో నెల్లి చెరువు, దేవుని బంద, సుందర నారాయణ పురంలో కోడువానిబంద, కొత్తవలసలో రాయిబంద లను గుర్తించామని అన్నారు. వీటిపై కొంత మేర నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించామని, తదుపరి నిర్మాణాలు చేపట్టకుండా రెవిన్యూ, పోలీస్ యంత్రాంగాలు నిఘా పెట్టాయని చెప్పారు. ఆక్రమణలకు ఎవరూ పాల్పడవద్దని, పట్టణ, భావితరాల భవిష్యత్తు దృష్ట్యా విశాల దృక్పథంతో ఆలోచించాలని ఆయన సూచించారు. ఆక్రమణదారులను గుర్తించామని వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.  నీటి వసతులు భూగర్భ జలాల పెంపుకు, వరదల సమయంలో పట్టణానికి ఎటువంటి ప్రమాదం లేకుండా నీటిని నింపుకునే గొప్ప వనరుగా ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. జిల్లా హెడ్ క్వార్టర్ మరింత అభివృద్ది చెందుతుందని అదే సమయంలో దాని రక్షణకు అందరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపనిచ్చారు.