నేటి తరానికి కలామ్ చక్కటి మార్గదర్శి


Ens Balu
12
2022-10-15 11:16:44

నేటి తరానికి భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న  ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ మార్గదర్శులని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత పేర్కొన్నారు. శనివారం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 91వ జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం, ఆల్ కట్ తోటలోని అబ్దుల్ కలాం ఐఏఎస్ అండ్ నీట్ అకాడమీ ప్రాంగణంలో  ఏర్పాటు చేసిన అబ్దుల్ కలాం జయంతి వేడుకల సందర్భంగా విగ్రహా ఆవిష్కరణ చేసి విగ్రహానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు.  ఈ సందర్బంగా కలెక్టరు డా.కే.మాధవీలత మాట్లాడుతూ  హార్డ్ వర్కు,హార్డ్ వర్క్, హార్డ్ వర్క్ అని నిరంతరం
అబ్దుల్ కలామ్ పేర్కొనే వారన్నారు. అటువంటి వ్యక్తులు దేశానికే గర్వకారణమని, నేటి తరం  విద్యార్థులు , యువత వారి ఆదర్శయాలను  స్పూర్తిగా తీసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. రాష్ట్రపతి పదవికి ముందే దేశం కోసం ఆయన అందించిన సేవలు అనిర్వచనీయమని తెలిపారు. ఆర్మీ, పృద్వి వంటి మిస్సైల్స్ తో పాటు మొత్తం మిస్సైల్స్ రంగంలోనే దేశానికి ఆయన అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు. 

ఆయనకు పిల్లలన్న, విద్యార్థులన్న మక్కువని, తరచుగా తన హోదాను మరిచి కళాశాల విద్యార్థులతో ముచ్చటిస్తూ ఉండేవారని అన్నారు. కలామ్ రచించిన ఇగ్నిటెడ్ మైండ్స్, వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇండియా 2020 రచనలు పాత, కొత్త తరానికి కూడా చైతన్యం వస్తుందని తెలిపారు. అబ్దుల్ కలామ్ గొప్ప రాష్ట్రపతిగానే కాకుండా శాస్త్రవేత్తగా,  సామాజిక కర్తగా సేవలు అందించారన్నారు.   అటువంటి మహనీయుని జయంతిని నిర్వహించుకోవడం ఆనందదాయకమన్నారు. ఎంత పెద్ద లక్ష్యమైనా దానిని అధిరోహించే వరకు ప్రణాళికా బద్దంగా సాధన చేయాలని విద్యార్థులకు ఎల్లప్పుడు అబ్దుల్ కలామ్ చేప్పేవారన్నారు. 18 గంటలు చదివి ఒకరు విజయం సాధిస్తే మరొకరు విజయం సాధించ లేదంటే దాని అర్థం సరైన శిక్షణ పొందకపోవడమేనని అన్నారు. ఆయన చూపిన బాట అందరికి మార్గదర్శకమని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనలో పాలుపంచుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా ప్రజలకు, యువతకు పిలుపునిచ్చారు. 

అబ్దుల్ కలాం ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని, అబ్దుల్ కలాం ఆశయాలకు అనుగుణంగా భోధన చేస్తామని అకాడమీ  డైరెక్టర్ సూరి కుమారి అన్నారు. 5 వేల మంది ఐ.ఏ.ఎస్ లను, 5 వేల మంది ఇంజనీర్లు ను తయారు చేయడమే అకాడమీ లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. అకాడమీ ఫౌండర్, మెంటర్ రామ్ గోపాల్ మాట్లాడుతూ 2013 అకాడమీ స్థాపించామని తెలిపారు. ఈ అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, క్విజ్ పోటీలు నిర్వహించి క్యాష్ ప్రైజ్ లు ఇస్తున్నామని తెలిపారు. అక్టోబర్ 30న రాష్ట్ర స్థాయిలో క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో  గెలుపొందిన విద్యార్థులకు రూ 50 వేల రూపాయలు క్యాష్ ప్రైస్ ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ రామ్ గోపాల్, అకాడమీ డైరెక్టర్ సూరి కుమారి, నన్నయ యూనివర్సిటీ ప్రొఫెసర్ టేకి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మాజీ చైర్ ఫర్సన్ బి. పద్మావతి తదితరులు పాల్గొన్నారు.