ప్రైవేటు ఆసుపత్రి తలదన్నేలా సేవలందాలి


Ens Balu
19
2022-10-15 11:30:16

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులు తమకు అత్యుత్తమ వైద్య సేవలు అందాయనే సంతృప్తితో ఆసుపత్రి నుంచి తిరిగి వెళ్ళాలన్నదే ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని ఆ మేరకు వైద్యసేవలు మెరుగుపరిచే దిశగా వైద్యులు కృషి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ప్రభుత్వ వైద్యులకు సూచించారు. ఆసుపత్రుల్లో నాడు – నేడు పేరుతో వసతులు మెరుగు పరచడంలో ముఖ్య ఉద్దేశ్యం ఇదేనని చెప్పారు.   ప్రైవేటు ఆసుపత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే తమకు మంచి వైద్య సేవలు అందుతాయనే అభిప్రాయాన్ని కలుగజేసే దిశగా ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు పని చేయాలన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు శనివారం జిల్లా కేంద్ర ఆసుపత్రిని సందర్శించారు.

 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సూర్యకుమారి తో కలసి జిల్లా ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించి రోగుఅలకు అందుతున్న సేవలపై ఆరా తీసారు. ముందుగా జిల్లా ఆసుపత్రిలో రోగులకు సౌకర్యాలు మెరుగు పరిచేందుకు చేపట్టిన అదనపు నిర్మాణాలు, కల్పిస్తున్న అదనపు వసతులపై వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల సంస్థ అధికారులు సత్యప్రభాకర్, ఎస్.ఇ. శివకుమార్ తదితరులు చిత్రపటాల ద్వారా వివరించారు. 
ఓ.పి. నమోదు విభాగాన్ని తనిఖీ చేసి రోజుకు ఎంతమంది ఓ.పి. నమోదు అవుతోందని ముఖ్య కార్యదర్శి తెలుసుకున్నారు. రోజుకు 600 మంది వరకు రోగులు నమోదు అవుతున్నట్టు అక్కడి సిబ్బంది తెలిపారు. ఓ.పి. నమోదు ఎంతమంది సిబ్బందితో నిర్వహిస్తున్నదీ తెలుసుకున్నారు. కొత్తగా ఓ.పి.బ్లాక్ నిర్మిస్తున్నామని అక్కడ 11 కౌంటర్ లు ఏర్పాటు చేయనున్నట్టు ఇంజనీరింగ్ అధికారులు వివరించారు. 

అనంతరం ఆరోగ్యశ్రీ విభాగాన్ని పరిశీలించి ఇక్కడికి వచ్చే రోగులకు ఆరోగ్యమిత్రాల ద్వారా అందిస్తున్న సేవలపై తెలుసుకున్నారు. రోగులకు సంబంధించిన డయాగ్నొస్టిక్ సమాచారాన్ని, ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ లను, కేసు రికార్డులను, వారికి ఇస్తున్న మెడిసిన్ ను ఒక కోడ్ నెంబర్ ఇచ్చి ఆన్ లైన్ లో వుంచినట్లయితే వాటిని ఇతర వైద్యులు ఎక్కడ వారికి చికిత్స అందించినా వారికి కేస్ హిస్టరీ అందుబాటులో వుంటూ చికిత్స సులభతరం అవుతుందన్నారు. అనంతరం ఆసుపత్రిలోని వైద్యులు, జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారితో ఆసుపత్రి సూపరింటెండెంట్ ఛాంబర్ లో సమావేశమయ్యారు.  ఈసందర్భంగా ఆసుపత్రిలో వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది ఖాళీల భర్తీ ప్రక్రియపై సమీక్షించారు. ఖాళీల భర్తీలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.కే.పద్మలీల వివరించారు. ముఖ్యంగా వికలాంగులకు కేటాయించిన ఖాళీల భర్తీ సమస్యగా ఉంటుందని దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. వెంటనే రాష్ట్ర స్థాయి వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ముఖ్య కార్యదర్శి ఫోన్ లో మాట్లాడి పోస్టుల భర్తీపై స్పష్టత ఇచ్చారు. 

ఆసుపత్రిలో డయాగ్నొస్టిక్ పరికరాల అవసరం లభ్యత పై ముఖ్య కార్యదర్శి ఆరా తీసారు. శస్త్ర చికిత్సలకు అవసరమైన పరికరాలు, సామాగ్రి అందుబాటులో తగినంతగా అందుబాటులో ఉన్నదీ లేనిదీ ఆరా తీసారు. మందుల లభ్యతపై కుడా తెలుసు కున్నారు.  ఇక్కడి సెంట్రల్ డ్రగ్ స్టోర్ లో 575 రకాల మందులు అందుబాటులో వున్నట్టు డ్రగ్ స్టోర్ అధికారులు వివరించారు. మందులకు ఎలాంటి కొరత లేదని తెలిపారు. ఇండెంట్ ఇచ్చిన వెంటనే మందులు సరఫరా చేస్తున్నదీ లేనిదీ తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ కింద ఆసుపత్రులకు ఇస్తున్న నిధుల్లో ౩౦శాతం రోగుల సౌకర్యాల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుందని వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు చెప్పారు. ఈ మొత్తాన్ని సిబ్బంది జీతాల కోసం ఖర్చు చేయడం సరికాదన్నారు. రోగులకు అవసరమైన ప్రత్యెక మందులు, చికిత్స పరికరాలు ఈ నిధులతోనే కొనుగోలు చేయవచ్చన్నారు.

నగరంలో తల్లిబిడ్డలకు వైద్య సేవలందించే ఘోషా ఆసుపత్రిని కొత్తగా ఏర్పాటు చేసే వైద్య కళాశాలలో కలపకుండా దీనిని ప్రత్యెక తల్లీపిల్లల ఆసుపత్రిగా కొనసాగించినట్లయితే ప్రజలకు మంచి సేవలు అందుతాయని ఆసుపత్రి వైద్యులతో పాటు జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ముఖ్య కార్యదర్శికి వివరించారు. ఈ అంశాన్ని ప్రభుత్వ స్థాయిలో చర్చిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని భోగాపురం వద్ద రోడ్డు ప్రమాద బాధితుల అత్యవసర చికిత్స కోసం ట్రామా కేర్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ అంశాన్ని పరిశీలిస్తామని ముఖ్య కార్యదర్శి చెప్పారు. ఈ పర్యటనలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సీతారామ రాజు, డి.సి.హెచ్.ఎస్. డా.నాగభూషణ రావు, డి.ఎం.హెచ్.ఓ. డా.రమణ కుమారి తదితరులు పాల్గొన్నారు.