యువతను క్రియీశీలకంగా మార్చాలి..
Ens Balu
3
Vizianagaram
2020-09-22 18:41:07
యువతను క్రియాశీలకంగా చేసి గ్రామాలు, పట్టణాల్లో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో యువతను భాగస్వామ్యం చేయడం ద్వారా యువత శక్తి సామర్ధ్యాలు సమాజాభివృద్ధిలో వినియోగించుకొనే లక్ష్యంతో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడి ఒక కార్యక్రమానికి రూపకల్పన చేశారని జాయింట్ కలెక్టర్(ఆసరా&సంక్షేమం) జె.వెంకటరావు తెలిపారు. దీనిలో భాగంగా ప్రతి గ్రామంలో యువజన సంఘాలను ఏర్పాటు చేసి వారి ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయడం, యువతకోసం నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలన్నీ యువజన సంఘాల సహాయ సహకారాలతో అమలు చేసే లక్ష్యంతో అన్నిగ్రామ పంచాయతీలు, మునిసిపల్ వార్డుల్లో కొత్తగా యువజన సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. నెహ్రూయువ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీరాజ్ విభాగం గ్రామాల్లోనూ, పురపాలక శాఖ ఆధ్వర్యంలో పట్టణాల్లోనూ ఈ సంఘాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలో రెండు యువజన సంఘాలు, ఒక సచివాలయం పరిధిలో ఒక గ్రామాభివృద్ధి సంఘం ఏర్పాటవుతాయన్నారు. ఒక్కో మునిసిపల్ వార్డులో ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తారని తెలిపారు. జిల్లాలోని 960 గ్రామ పంచాయతీ పరిధిలోనూ, నగరపాలక సంస్థ, ఐదు మునిసిపాలిటీల పరిధిలో ఈ తరహాలో సంఘాలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా స్థాయి యువజన సలహా కమిటీ సమావేశం జాయింట్ కలెక్టర్ వెంకటరావు అధ్యక్షతన మంగళవారం మర్రి చెన్నారెడ్డి భవనంలోని జె.సి. ఛాంబరులో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖలు నెహ్రూయువ కేంద్రంతో యువజన సంఘాల ఏర్పాటు, యువతకోసం చేపట్టే కార్యక్రమాల అమలులో పూర్తి సహకారం అందించాలని కోరారు. నెహ్రూ యువకేంద్రం జిల్లా యూత్ ఆఫీసర్ జి.విక్రమాదిత్య మాట్లాడుతూ జిల్లాలో నమోదు చేసుకున్న సంఘాలన్నింటికీ జీరో బ్యాలెన్స్ ఖాతాలు ప్రారంభించడంలో సహకరించాలని ఎల్.డి.ఎం.ను కోరారు. ఈ సమావేశంలో పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కె.ప్రసాదరావు, కాలుష్య నియంత్రణ మండలి ఇ.ఇ. బి.సుదర్శనం, ఎల్.డి.ఎం. శ్రీనివాసరావు, నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ ప్రసాదరావు, డి.ఆర్.డి.ఏ. ఏపిడి మురళి, జిల్లా అటవీ అధికారి జానకిరావు, డివిజనల్ పంచాయతీ అధికారి మోహనరావు, సెట్విజ్ సి.ఇ.ఓ. నాగేశ్వరరావు, ఎన్.సి.సి., ఎన్.ఎస్.ఎస్. అధికారులు, కార్మికశాఖ, ఫ్యాక్టరీస్ విభాగం అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.