పార్వతీపురం మన్యం జిల్లాలో అన్ని రైతు భరోసా కేంద్రాలలో 19వ తేదీ నుండి రైతు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.డి.నాయక్ తెలిపారు. ఈ మేరకు మంగళ వారం మీడియా ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు, విధి విధానాలపై స్పష్టమైన అవగాహన కల్పించుటకు రైతు సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకు వచ్చే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రభుత్వ నిబంధనలు ప్రతి రైతు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, వాటిని సద్వినియోగం చేసుకొను విధానాలు తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఉదయం 10 గంటల నుండి అన్ని రైతు భరోసా కేంద్రాలలో రైతు సదస్సు ఉంటుందని రైతులు సదస్సుకు హాజరై అవగాహన చెంది ప్రయోజనం పొందాలని ఆయన కోరారు.