పార్వతీపురం మన్యం జిల్లాలో నాడు నేడు పనులలో గణనీయ ప్రగతి కనిపించాలని పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి.విష్ణు చరణ్ అన్నారు. పేదరిక నిర్మూలన సంస్థ సహాయ ప్రాజెక్టు మేనేజర్ల (ఏపిఎం)కు నాడు నేడు పనుల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గిరి మిత్ర సమావేశ మందిరంలో మంగళ వారం ఏపిఎంలకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రాజెక్టు అధికారి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ నాడు నేడు పనులలో జిల్లా వెనుకబడి ఉందని అన్నారు. ప్రభుత్వం ఏపిఎంలకు నాడు నేడు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించిందని ఆయన పేర్కొన్నారు. నాడు నేడు పనులను ప్రభుత్వం ప్రాధాన్యతతో చేపడుతుందని ఆయన చెప్పారు. పాఠశాలలు ఆహ్లాదంగా మారుతున్నాయని, విద్యార్థులలో ఆనందం వెల్లివిరుస్తోందని పేర్కొంటూ ప్రస్తుతం జరుగుతున్న పనులు వేగవంతం చేయడానికి శ్రద్ద వహించాలని ఆయన స్పష్టం చేశారు.
నాడు నేడు పనుల విధివిధానాలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. నిబంధనలు తు.చ తప్పకుండా అమలు చేస్తూ నాణ్యతలో రాజీ పడకుండా పనులు చేయాలని ఆయన ఆదేశించారు. నాడు నేడు పనులతోపాటు జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, మధ్యాహ్న భోజన పథకం తదితర కార్యక్రమాలను కూడా పరిశీలించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డా.ఎస్.డి.వి రమణ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. కిరణ్ కుమార్, పేదరిక నిర్మూలన సంస్థ ఎపిడి వై. సత్యం నాయుడు, తదితరులు పాల్గొన్నారు.