నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ఘన వ్యర్ధ పదార్థాలు, లిక్విడ్ వేస్ట్( వ్యర్థ జలాలు )లను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహణ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని కార్పొరేషన్ కమిషనర్ కే.రమేష్ చెప్పారు. మంగళవారం ఆయన ఎస్ఈ సత్యకుమారి, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీ చరణ్, డిఈ మాధవి, ఇతర అధికారులతో కలిసి సేంద్రీయ ఎరువు తయారీ కేంద్రాన్ని, డంపింగ్ యార్డ్ ను సందర్శించారు. అంతకుముందు మిషన్ క్లీన్ ఫర్ గోదావరి కృష్ణ కెనాల్స్ లో భాగంగా ఇంద్రపాలెం నుంచి మాధవపట్నం వరకు చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. జడ్పీ సెంటర్ వద్ద జరుగుతున్న పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ రమేష్ విలేకరులతో మాట్లాడుతూ రోజూ ప్రజల నుంచి సేకరించిన తడి చెత్తను సేంద్రీయ ఎరువు తయారికి వినియోగిస్తున్నామన్నారు. పొడి చెత్తను రీసైక్లింగ్ కోసం ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తున్నామన్నారు. బయో మెథనైజేషన్ ప్లాంట్ కూడా త్వరలో అందుబాటులోకి రానుందన్నారు.
నాన్ రీసైక్లబుల్ కంబస్టబుల్ డ్రై వేస్ట్ ను విశాఖ లోని బిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కు పంపిస్తున్నామన్నారు. రోజు విడిచి రోజు 10 టన్నుల కంబస్టబుల్ డ్రై వేస్ట్ తరలిస్తున్నట్లు కమిషనర్ చెప్పారు. ప్రజలు కూడా తడి, పొడి చెత్తను వేరువేరుగా సిబ్బందికి అందజేయాలని కోరారు. అలాగే వ్యర్థ జలాలు, భవన నిర్మాణ వ్యర్ధాలను కూడా శాస్త్రీయ పద్ధతిలో నూ రు శాతం ప్రాసెసింగ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ మేరకు ఇటీవల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను పూర్తిస్థాయిలో అమలు జరిగేలా సంబంధిత అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఆయన సూచించారు. మిషన్ క్లీన్ ఫర్ గోదావరి కెనాల్ కార్యక్రమంలో భాగంగా కెనాల్ ప్రాంగణాన్ని సుందరీకరణ చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆయన సంబంధిత అధికారులతో చర్చించి సూచనలు ఇచ్చారు. ఇంద్ర పాలెం వంతెన వద్ద పొరుగున ఉన్న పంచాయతీ ప్రాంత ప్రజలు చెత్తను తీసుకువచ్చి వేయడం పై అసహనం వ్యక్తం చేశారు. చెత్తను కెనాల్ ఆవరణలో వేయకుండా ఉండేలా సంబంధిత పంచాయతీ అధికారులతో మాట్లాడాలని ఆయన అధికారులకు సూచించారు.