ఎంతో క్రమశిక్షణ, అంకితభావం గల జిల్లా పంచాయితీ అధికారి ఇందిరా రమణ ఆకస్మిక మరణం తీవ్ర బాధాకరమని, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అన్నారు. ఆమె లేని లోటు తీర్చలేనిదని ఆయన పేర్కొన్నారు. ఇందిరా రమణకు జిల్లా యంత్రాంగం బుధవారం ఘనంగా నివాళులర్పించింది. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆమె చిత్రపటానికి వివిధ శాఖల అధికారులు పూలమాలలు వేసి, శ్రద్దాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో జెసి మయూర్ అశోక్ మాట్లాడుతూ, జిల్లా పంచాయితీ అధికారి ఆకస్మిక మరణం నమ్మశక్యం కానిదని అన్నారు. ఆమె అంకితభావం గల అధికారిణి అని, కొద్ది కాలంలోనే డిపిఓగా ఆశాఖపై తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. అధికారులు ఎంతో కష్టపడి పని చేస్తున్నారని, తమ ఆరోగ్యంపై కూడా శ్రద్ద పెట్టాలని సూచించారు.
జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు మాట్లాడుతూ, ఇందిరా రమణ ఆకస్మిక మరణం తీవ్ర ద్రిగ్భాంతిని కల్గించిందని అన్నారు. ఇలాంటి సంఘటన ఎంతో దురదృష్టకరమని, ఇప్పటికీ నమ్మశక్యంగా లేదని పేర్కొన్నారు. అధికారులు తమ ఆరోగ్యంపైనా శ్రద్దపెట్టాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా పరిషత్ సిఇఓ డాక్టర్ ఎం.అశోక్‌కుమార్, మెప్మా పిడి సుధాకరరావు, మున్సిపల్ కమిషనర్ ఆర్.శ్రీరాములనాయుడు మాట్లాడారు. ఇందిరా రమణతో తమకున్న అనుబంధాన్ని, విధి నిర్వహణ పట్ల ఆమె అంకిత భావాన్ని వివరించారు. కార్యక్రమంలో మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారితోపాటు వివిధ శాఖల అధికారులు, పంచాయితీ శాఖ సిబ్బంది పాల్గొని నివాళులర్పించారు.