ఆరుగాలం శ్రమించి రైతు పండించిన పంటకు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) అందించే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ విధానాన్ని అమలుచేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి.వీరపాండియన్ పేర్కొన్నారు. నవంబర్ రెండో వారం నుంచి ఖరీఫ్ (2022-23) సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రక్రియ ప్రారంభంకానున్న నేపథ్యంలో వీరపాండియన్.. బుధవారం కాకినాడ కలెక్టరేట్‌లో కలెక్టర్ డా. కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి పౌర సరఫరాలు, లీగల్ మెట్రాలజీ, లేబర్, మార్కెటింగ్ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరపాండియన్ మాట్లాడుతూ ఈ-క్రాప్ జరిగిన విస్తీర్ణం 2,24,871 ఎకరాలు కాగా.. 5,05,959 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కానుందని తెలిపారు.
ధాన్యం సేకరణ ప్రక్రియలో ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండాలని మొదటి నుంచి చివరి వరకు ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా సాగేలా 1,113 మంది సిబ్బంది పాల్గొననున్నారని.. వీరికి శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. రైతు తాము పండించిన పంటకు మద్దతు ధర పొందేలా క్షేత్రస్థాయి సిబ్బంది అవసరమైన సహాయసహకారాలు అందించాలని, ఈ విషయంలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి ఆర్‌బీకేలోనూ ధాన్యం సేకరణకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన పోస్టర్‌ను ప్రదర్శించాలని.. దీంతో మద్దతు ధర, నాణ్యతా ప్రమాణాలు, అందుబాటులో ఉన్న అవకాశాలు తదితరాల సమాచారం రైతులకు తెలుస్తుందన్నారు. తేమను కొలిచే మీటర్లు వంటి వాటిని ఆర్‌బీకేలలో అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.
పూర్తిస్థాయి సన్నద్ధతతో ధాన్యం సేకరణ కేంద్రాల కార్యకలాపాలను ప్రారంభించడం ద్వారా ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయొచ్చని వీరపాండియన్ పేర్కొన్నారు. సమీక్షా సమావేశానంతరం వీరపాండియన్.. కలెక్టరేట్ విధానగౌతమి సమావేశమందిరంలో ధాన్యం సేకరణ సిబ్బందికి జరుగుతున్నశిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. సమావేశంలో జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, సివిల్ సప్లయ్స్ డీఎం డి.పుష్పమణి, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.విజయ్‌కుమార్, డీఎస్‌వో డి.చాముండేశ్వరి తదితరులు హాజరయ్యారు.