అధీకృత సంస్థ ద్వారానే ధాన్యం రవాణా


Ens Balu
7
Parvathipuram
2022-10-19 13:39:48

అధీకృత సంస్థ ద్వారానే ఖరీఫ్ ధాన్యం రవాణా జరుగుతుందని ఇన్ ఛార్జ్ జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఖరీఫ్ ధాన్యం రవాణాపై పౌర సరఫరాల సంస్థ, రవాణా సంఘం సభ్యులతో బుధవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇన్ ఛార్జ్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు జిల్లాలో అధీకృత సంస్థ లారీలను ధాన్యం రవానాకు సరఫరా చేయాలన్నారు. మిల్లర్లతో ప్రమేయం లేకుండా రవాణా జరగాలనేది ప్రభుత్వ ధ్యేయమని ఆయన చెప్పారు. అధీకృత సంస్థ రైతు వద్ద నుండి రవాణా చేస్తుందని ఆయన అన్నారు. అధీకృత సంస్థ ఈ మేరకు అవసరమైన లారీలను సిద్దంగా ఉంచాలని ఆయన పేర్కొన్నారు. 

జిల్లాలో గల లారీల వివరాలు సమర్పించాలని జిల్లా రవాణా శాఖను ఆయన ఆదేశించారు. జిల్లాలో లారీల కొరత లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో ధాన్యం సేకరణ సజావుగా, సాఫీగా సాగుటకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఇందుకు అన్ని వర్గాలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆనంద్ అన్నారు. ధాన్యం నిలువలకు అవసరమగు గిడ్డంగులను సిద్ధం చేయాలని భారత ఆహార సంస్థ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ అధికారులకు సూచించారు. 

రవాణా విధానంలో చేర్పులు మార్పులు చేయాలని రవాణా సంఘం సభ్యులు సూచించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.డి.నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ రీజనల్ మేనేజర్ ఎస్. రవి కుమార్, భారత ఆహార సంస్థ జిల్లా మేనేజర్ ప్రఫుల్ల కుమార్ సాహు, మేనేజర్ ఏ.వి.రమణ, ట్రాన్స్ పోర్ట్ సంఘం అధ్యక్షులు జి.వి.రమణ, రైస్ మిల్లర్ల ప్రతినిధి కె.రమేష్,  తదితరులు పాల్గొన్నారు.