కాకినాడ జిల్లాలో ఈ నెల 1వ తేదీ నుండి 19వ తేదీ వరకూ మొత్తం 1145 కోవిడ్ నిర్వహించగా, 59 పాజిటీవ్ కేసులు గుర్తించడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.యం.శాంతిప్రభ తెలియజేసారు. వీటిలో ఎక్కువ కేసులు మైల్డ్ సింప్టమ్స్ తో ఆసుపత్రి సేవలు అవసరం లేకుండా యాంటి బయోటిక్స్, యాంటి పైరటిక్స్ మందులతో నయమైయ్యాయని, ప్రస్తుతం జిల్లాలో కేవలం 18 యాక్టివ్ పాజిటీవ్ కేసులు మాత్రమే ఉన్నాయని, అన్నీ వైద్య పర్యవేక్షణలో ఉన్నాయని ఆమె తెలియజేశారు. జిల్లా అంతటా ఆశా వర్కర్లు, ఎఎన్ఎం ల ఇంటింటి సందర్శన ద్వారా జ్వర లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అన్ని పి.హెచ్.సిలు, యు.పి.హెచ్.సిలు, సి.హెచ్.సి.లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా కేంద్ర ఆసుపత్రిలలో కోవిడ్ పాజిటీవ్ వ్యక్తులకు ప్రయివేట్ ఆసుపత్రులను ఆశ్రయించవలసిన అవసరం లేకుండా వైద్య సహాయం ఉచితంగా అందిస్తున్నామని డియంహెచ్ఓ తెలిపారు.
అలాగే కాకినాడ నగరంలో ఇటీవల భారీవర్షాల వల్ల సాంబమూర్తినగర్, గోడారిగుంట, సినిమారోడ్డు తదితర ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీటి కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా 100 మంది పబ్లిక్ హెల్త్ వర్కర్లను నియోగించి, డ్రెయిన్ల క్లియరింగ్, పంపింగ్ ద్వారా మొత్తం నీరంతటినీ యుద్దప్రాతిపదికన ఒక్క రోజులో తొలగించామని కాకినాడ మున్సిపల్ కమీషనర్ కె.రమేష్ తెలియజేశారు. నగరంలో ముంపుతాకిడికి లోనైన అన్ని ఆవాసాల్లో దోమల నివారణకు యాంటీలార్వా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టడం జరిగిందన్నారు. కాకినాడ నగర పరిధిలో అక్టోబరు నెలలో ఇప్పటి వరకూ కోవిడ్ కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదని, 2 డెంగ్యూ కేసులు మాత్రమే జిజిహెచ్ లో రిపోర్ట్ అయ్యాయని తెలియజేశారు. తరచుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కాకినాడ నగరంలో ఎటువంటి సీజనల్ వ్యాధులు, వైరల్ జ్వరాలు ప్రభల కుండా పారిశుద్య, ఆరోగ్య రక్షణ కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహిస్తున్నామని కమీషనర్ తెలిపారు.