విద్యార్థి, విద్యార్థుల భద్రతే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా "14417" టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రభుత్వం తీసుకు వచ్చిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రి జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా పాఠశాల భద్రతా సలహా కమిటీ సమావేశానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. కే మాధవి లత మాట్లాడుతూ, విద్యాబోధన సమయంలో విద్యార్థులకు సురక్షితమైన వాతావరణాన్ని నెలకొల్పడంలో సమగ్ర భద్రతా చర్యలు చేపట్టెందుకు ప్రతి పాఠశాలలో ఉండే పేరెంట్ కమిటీ సభ్యులు బాధ్యతగా పనిచేయాలని పేర్కొన్నారు. విద్యార్థుల భద్రతే లక్ష్యంగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ తో సహా అన్ని ప్రతి పాఠశాలలో 14417 టోల్ ఫ్రీ సేవల ను ఏర్పాటు చేశామన్నారు. ఏ సమస్య ఉన్నా నిర్భయంగా ఫిర్యాదు చేస్తే, తగిన విధంగా స్పందించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఖచ్చితంగా స్కూల్స్ లో ఫిర్యాదుల పెట్టే (కంప్లైంట్ బాక్స్) ఏర్పాటు చేయడం, ప్రతి,15 రోజులకు ఒకసారి వాటిపై చర్చిచించాలన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో కంప్లైంట్ బాక్స్ లో ఉన్న ఫిర్యాదులను పరిశీలించి పాఠశాల పేరెంట్స్ కమిటీ సమావేశంలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం, నివేదిక అందచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
పిల్లలకు సురక్షితమైన భోధన సౌకర్యాలను, అన్ని పాఠశాలల్లో (స్ట్రక్చరల్ మరియు నాన్ స్ట్రక్చరల్) ప్రమాదాలు నివారణ (డిజాస్టర్ రిస్క్) తగ్గింపు చర్యలను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని కలెక్టర్ మాధవీలత అన్నారు. ఇంటి నుండి పాఠశాలకు, పాఠశాల నుంచి పిల్లలు ఇంటికి వెళ్లెవరకూ భద్రతను కల్పించడం చాలా కీలకం అన్నారు. అన్ని మండల విద్యాశాఖాధికారులతో త్రైమాసిక సమీక్ష సమావేశాలు నిర్వహించడం, మండల, గ్రామ స్థాయి భద్రతా సలహా కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కమిటీలు స్కూల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ పై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న టోల్ ఫ్రీ నెంబర్, ఫిర్యాదుల పెట్టే పై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలన్నారు.
విద్యార్థుల ఆరోగ్య భద్రతకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాఠశాలల్లో పర్యవేక్షించాలని కలెక్టర్ మాధవీలత అన్నారు. ఈ ప్రక్రియ నిరంతరం సాగే విషయం కావున, తరచుగా సమావేశాలు నిర్వహించి సమస్య పరిష్కారం కోసం ప్రతిపాదనలపై చర్చించాలన్నారు. రవాణా శాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలలో, కళాశాలల్లో నడిపే బస్సుల క్రమ అంతరాలలో ,(రెగ్యులర్ గా) ఫిట్నెస్ తప్పనిసరిగా తనిఖీ చేసి పర్యవేక్షించాలన్నారు. దిశా యాప్, అగ్ని ప్రమాద నివారణ తదితర అంశాలపై పోలీస్, అగ్నిమాపక అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి శాఖాపరంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి స్కూల్ లో దిశ పోస్టర్లను ఉంచి దిశ చట్టంపై పిల్లల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. స్కూల్స్ లో త్రాగునీటి వసతి, పరిశుభ్రత పరిరక్షణ వంటి వాటిపై సంబందించిన ఆయా శాఖా ల ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.