చదువులు పూర్తిచేసుకున్న యువతకు తక్షణమే ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు యువత తమలోని ప్రతిభను మరింత మెరుగుపరుచుకునేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నట్లు కాకినాడ ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో కాకినాడ గ్రామీణం ఐటీఐ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటుచేసిన స్కిల్ హబ్ సెంటర్ ను ఎంపీ వంగాగీత.. జిల్లా కలెక్టరు డా. కృతికా శుక్లా, కాకినాడ గ్రామీణ నియోజకవర్గం శాసనసభ్యులు కురసాల కన్నబాబు, కాకినాడ పట్టణ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వంగాగీత మాట్లాడుతూ సీఎం విద్యా, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో చదువులు పూర్తి చేసుకున్న యువతకు తక్షణమే ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు యువతలో ఉన్న ప్రతిభను మరింత మెరుగుపరుచుకునేందుకు వీలుగా జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి ఒక స్కిల్ హబ్ సెంటర్ ఏర్పాటు చేసి యువతకు వివిధ అంశాలపై నైపుణ్య శిక్షణ ఇస్తారని తెలియజేశారు.
జిల్లా కలెక్టరు కృతికా శుక్లా మాట్లాడుతూ ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా అభ్యర్థుల్లో నైపుణ్యాలు పెంపొందించి..ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు లభించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్‌డీసీ) నోడల్ ఏజెన్సీగా అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున స్కిల్ హబ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో తొలి దశ కింద కాకినాడ గ్రామీణ నియోజకవర్గానికి సంబంధించి కాకినాడ ఐటీఐ ప్రాంగణంలో ప్రారంభించడం శుభపరిణామమని ఆమె తెలిపారు. రానున్న నాలుగు నెలల్లో రెండో దశ కింద తుని, పెద్దాపురం జగ్గంపేట, పిఠాపురం, ప్రత్తిపాడు, కాకినాడ అర్బన్ నియోజవర్గాల్లోనూ స్కిల్ హబ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టరు వివరించారు.
కాకినాడ గ్రామీణ నియోజకవర్గం శాసనసభ్యులు కురసాల కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ప్రారంభించిన నాటి నుంచి స్థానికంగా ఉన్న పరిశ్రమలలో స్థానిక యువతకు 75 శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. చదువు పూర్తిచేసుకున్న విద్యార్థులు మంచి ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవాలంటే విద్యార్థులు ఎంచుకున్న అంశాలపై కొంత శిక్షణ పొందడం చాలా అవసరమని ఆయన తెలిపారు. ప్రాముఖ్యంగా యువతకు క్రమశిక్షణ, అంకిత భావం నిబద్దత కలిగి ఉండడంతో పాటు ఇంగ్లీష్ భాషపై పట్టు సాధిస్తే మెరుగైన ఉపాధి అవకాశాలు పొందొచ్చని కన్నబాబు తెలిపారు.
కాకినాడ పట్టణ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నత విద్యను అభ్యసించే విధంగా ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన వంటి కార్యక్రమాల ద్వారా చక్కటి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారన్నారు. గొప్ప సంస్థల్లో ఉపాధి అవకాశాలు పొందుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న నైపుణ్య శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సమావేశంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి డి.హరిశేషు, వికాస పీడీ కె.లచ్చారావు, జిల్లా ఉపాధి అధికారి కె.శాంతి, ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ తదితరులు హాజరయ్యారు.