పారిశ్రామికంగా అనకాపల్లిని అగ్రస్థానంలో నిలుపుతా


Ens Balu
28
Anakapalle
2022-10-30 14:44:48

పారిశ్రామిక రంగంలో రాష్ట్రంలో అనకాపల్లిని మొట్టమొదటి స్థానంలో నిలుపుతానని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. అనకాపల్లి మండలం కోడూరు గ్రామంలో సుమారు 60 ఎకరాలలో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎమ్ఈ పార్కుకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో అమర్నాథ్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు అనకాపల్లి అభివృద్ధిని పట్టించుకోలేదని, వేల ఎకరాల ప్రభుత్వ స్థలం వున్నా, పారిశ్రామికంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆలోచన చేయలేకపోయాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రాన్ని పారిశ్రాంగంలో ముందుకు తీసుకువెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో అనకాపల్లిలో ఎమ్మెస్ఎమ్ఈ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారని, తాను పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఎమ్మెస్ఏమీ పార్క్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి మరింత ప్రోత్సాహం అందించారని అమర్నాథ్ తెలియజేశారు. అనకాపల్లి జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వున్నాయని, వీటికి ఎంఎస్ఎమ్ఈ రంగం కూడా తోడైతే ఈ జిల్లాలో చాలా వరకు నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 ప్రస్తుతం ఏర్పాటుచేసిన ఎంఎస్ఎంఈ పార్క్ లో 36 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి అమర్నాథ్ తెలియజేశారు. పార్క్ లో 200 ఫ్లాట్లు ఏర్పాటు చేయడానికి విఎంఆర్డిఏ నుంచి త్వరలోనే అనుమతులు లభించనున్నాయని ఆయన తెలియజేశారు. ఎమ్మెస్ఎమ్ఈ పార్క్ ను జాతీయ రహదారులకు అనుసంధానం చేసేందుకు 12 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నామని ఆయన తెలియజేశారు. ఎంఎస్ఎమ్ఈ పార్కుకు ఆనుకునే మరో 70 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కులు కూడా ఏర్పాటు చేయనున్నట్లు అమర్నాథ్ తెలియజేశారు. "1978 లో మా తాతగారు గుడివాడ అప్పన్న గాజువాకలో ఆటోనగర్ యేర్పాటుకు పునాది వేశారని, ఇప్పుడు నేను కోడూరులో ఎంఎస్ఎమ్ఈ పార్కు శంకుస్థాపన చేయడం అదృష్టoగా భావిస్తున్నాను" అని అమర్ నాథ్ చెప్పారు.
రాష్ట్రంలో ఎంఎస్ఎమ్ఈలకు చేయూతనిచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని ఇందులో భాగంగానే 2020-21 సంవత్సరానికి సంబంధించిన ఎమ్మెస్ఎంఈలకు రావలసిన ఇన్సెంటివ్ లను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారని అమర్నాథ్ వెల్లడించారు. 


ఇదిలా ఉండగా, అనకాపల్లి జిల్లాలో సుమారు 25వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఇది కార్యరూపం దాలిస్తే, ఏడున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఇప్పటికే జిల్లాలో ఉన్న వివిధ పరిస్థితుల్లో రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని ఆయన వెల్లడించారు.
అనకాపల్లి ఎంపీ బీశెట్టి సత్యవతమ్మ  మాట్లాడుతూ అమర్ నాథ్ పరిశ్రమల శాఖ మంత్రిగా మన జిల్లాకు రావటం మన అదృష్టమని అన్నారు. పారిశ్రామిక రంగంలో అనకాపల్లి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఆమె అన్నారు.
కలెక్టర్ రవి పటాన్ శెట్టి మాట్లాడుతూ భవిష్యత్తులో కోడూరు ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని, కొత్తగా ఏర్పడిన అనకాపల్లి జిల్లాకు ఇంత పెద్ద పారిశ్రామికవాడ రావడం ముదావహమని అన్నారు. ఇక్కడ యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, పారిశ్రామికంగా అడుగులు ముందుకు వేస్తున్న ఈ జిల్లాలో యువతకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

పారిశ్రామిక అవసరాల కోసం భూములు ఇచ్చేవారికి రెవిన్యూ పరంగా ఎటువంటి సమస్యలు వచ్చినా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్ మాట్లాడుతూ అనకాపల్లిని అందాలపల్లిగా తీర్చిదిద్దుతానని ఎన్నికలలో ఇచ్చిన హామీని అమర్నాథ్ నెరవేరుస్తున్నారని చెప్పారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన ఎంఎస్ఎమ్ఈ పార్క్ అనకాపల్లికి రావడం మనందరికీ గర్వకారణం అని అన్నారు. అనకాపల్లి ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్న అమర్ నాథ్ పరిశ్రమల శాఖకు సరైన న్యాయం చేస్తున్నారని అన్నారు. మంత్రి అమర్నాథ్ నేతృత్వంలో అనకాపల్లి అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.
కార్యక్రమానికి అనకాపల్లి ఎంపీపీ గొర్లె సూరిబాబు అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ బీసెట్టి సత్యవతి, జడ్పీటీసీ శ్రీధర్ రాజు, కశింకోట ఎంపీపీ కలగా లక్ష్మీగున్నయ్య నాయుడు, మళ్ళ బుల్లిబాబు, ఎమ్మెస్ఎంఈ డైరెక్టర్ నదియా, కోడూరు సర్పంచ్ శానాపతి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.