రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని కోరుతూ, టీటీడీ ఆధ్వర్యంలో నవంబరు 7వ తేదీ నంద్యాల జిల్లా యాగంటి క్షేత్రంలో కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నారు. స్థానిక ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, టీటీడీ జెఈవో సదా భార్గవి ఆదివారం స్థల పరిశీలన చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి
భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున ఇందుకు తగిన ఏర్పాట్లపై వారు అధికారులతో చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే రామ్ భూపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ఎ వి ధర్మారెడ్డి సహకారంతో యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి చెంతన కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నామన్నారు.
నవంబరు 7వ తేదీ సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. తమప్రాంతం, రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా దీవించాలని స్వామి వారిని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. టీటీడీ, స్థానిక అధికార యంత్రాంగం సమన్వయంతో భక్తులకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జెఈవో సదా భార్గవి మాట్లాడుతూ, కార్తీక దీపోత్సవం నిర్వహణకు అవసరమైన స్థల పరిశీలన జరిపామన్నారు. ఏర్పాట్ల పై స్థానిక, టీటీడీ అధికారులతో సమీక్ష జరిపామన్నారు.
కార్తీక దీపోత్సవ విశిష్టతను భక్తులకు తెలిపేందుకు, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. టీటీడీ విద్యుత్ విభాగం ఎస్ఈ వెంకటేశ్వర్లు, డిఎఫ్ఓ శ్రీనివాస్ , విజివో మనోహర్ , శ్వేత డైరెక్టర్ ప్రశాంతి , అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ కుమార్ ,ఈఈ మల్లిఖార్జున ప్రసాద్ , అన్నదానం డిప్యుటీ ఈవో సుబ్రహ్మణ్యం పిఆర్వో డాక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే , జేఈవో అధికారులతో ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. భక్తులందరూ కార్యక్రమాన్ని చూసేందుకు వీలుగా వేదిక, ఎల్ఈడీ స్క్రీన్లు, డాక్టర్లు ,పారామెడికల్ సిబ్బంది
డిప్యుటేషన్ ,శ్రీవారి సేవకుల ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలపై అధికారులకు సూచనలు ,సలహాలు ఇచ్చారు. 6వతేదీకి ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.