ఖరీఫ్ నాటికి 200 పిపిసిలు..
Ens Balu
4
Srikakulam
2020-09-22 20:04:52
శ్రీకాకుళంజిల్లాలో ఖరీప్ నాటికి 200 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటుచేయాలని, ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ - 2020 ధాన్యం కొనుగోలు సన్నద్ధతపై సంయుక్త కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసే వెలుగు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా కేంద్ర మార్కెటింగ్ సంస్థ, గిరిజన సహకార సంస్థలు ఈ ఖరీఫ్ నాటికి ఈ సంఖ్యను పెంచాలని సూచించారు. ఈ ఏడాది ఖరీఫ్ నాటికి 200కు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు చేయాలని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు. అలాగే ఖరీఫ్ – 2020లోవరి సాదారణ రకం కనీస మద్ధతు ధర క్వింటాకు రూ. 1868/-లు, గ్రేడ్ + రకానికి క్వింటాకు రూ.1888/-లు రైతులకు అందించడం ప్రాధమిక ఉద్దేశ్యమని జె.సి స్పష్టం చేసారు. రైతులకు గిట్టుబాటు ధర అందించడమే ప్రభుత్వ ఆలోచన అని, ఆ దిశగా అధికారులు పనిచేయాలని కోరారు. జిల్లాలో వ్యవసాయోత్పత్తులు ఈ ఖరీఫ్ నాటికి పెరిగే అవకాశం ఉన్నందున వాటిని దృష్టిలో ఉంచుకొని ధాన్యం సేకరణ కేంద్రాలు ( పి.పి.సి )ను ఏర్పాటుచేయాలని అన్నారు. జిల్లాలో 200కు పైగా ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటుచేయాలని ఇందుకోసం వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్, జిల్లా పౌర సరఫరాల అధికారిలతో ఒక కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు జె.సి తెలిపారు. ఈ కమిటీ జిల్లాలో 200కు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకోసం తుదినిర్ణయం తీసుకొని, వాటిని రైతు భరోసా కేంద్రాలతో అనుసంధానం చేయాలని ఆదేశించారు. అలాగే జిల్లాలోని రైసు మిల్లుల స్థితిగతులను పరిశీలించి, నివేదికను తమకు అందజేయాలని పౌర సరఫరాల శాఖ ఉప తహశీల్ధారులను జె.సి ఆదేశించారు. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ను నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేస్తున్నందున సార్టెక్స్ మెషీన్స్ ఏర్పాటుచేయాలని జె.సి కోరారు. జిల్లాలోని ఎఫ్.సి.ఐ గొదాములలోని బియ్యాన్ని త్వరగా ఖాళీ చేసి నవంబర్ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. జిల్లాలో ఇ-క్రాప్ బుకింగ్ శత శాతం పూర్తికావాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్ ను జె.సి ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎ.కృష్ణారావు, జిల్లా పౌర సరఫరాల అధికారి, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్, మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు బి.శ్రీనివాసరావు, ఎఫ్.సి.ఐ జిల్లా మేనేజర్, యస్.డబ్య్లు.సి రీజనల్ మేనేజర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.