మౌలానా అబుల్ కలాం జయంతి ఘనంగా జరిగింది. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి కార్యక్రమం శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ దేశ మొదటి విద్యా శాఖ మంత్రి గా పనిచేసి, గొప్ప విద్యా విధానానికి మంచి పునాది వేశారని కొనియాడారు. నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు దృష్ట్యా దీర్ఘకాలిక వ్యూహంతో విద్యా విధానాలు ప్రవేశపెట్టారని ఆయన చెప్పారు. విద్యా వ్యాప్తికి పెద్ద ఎత్తున కృషి చేసారని ఆయన అన్నారు. జామియా మిలియా విశ్వవిద్యాలయం స్థాపించారని చెప్పారు. మక్కాలో గౌరప్రదమైన కుటుంబంలో జన్మించి భారత దేశం విచ్చేసి సేవలు అందించారని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. వార పత్రిక ప్రారంభించి ప్రజలలో స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తి నింపి, స్పందన రప్పించారని దానితో ఇంగ్లీష్ ప్రభుత్వం పత్రికను నిషేధించిందని చెప్పారు. మరో పత్రిక స్థాపించి ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించారని తెలిపారు. యుక్త వయస్సులోనే భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారని అన్నారు. దేశ విభజన, ఇతర సందర్భాల్లో మతపరమైన దాడులు జరుగుతున్నప్పుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉదారంగా పనిచేస్తూ, ఉద్రిక్తతలు తగ్గించుటకు ఎంతగానో కృషి చేశారని ఆయన వివరించారు. ఆజాద్ జయంతి రోజున అల్ప సంఖ్యాక వర్గాల దినోత్సవంగా ప్రకటించడం శుభసూచకమని చెప్పారు.
ఈ సందర్భంగా అల్ప సంఖ్యాక వర్గాల ప్రతినిధులు షేక్ షఫీ, మహ్మద్ జలాల్, సందీర్ చంద్ర తదితరులు నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.హేమలత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బగాది జగన్నాథ రావు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి డి.మంజుల వీణ, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డా.ఎం.వి.ఆర్.కృష్ణాజి, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, జిల్లా విద్యా శాఖ అధికారి డా.ఎస్.డి.వి.రమణ, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి జి.వరహాలు, జిల్లా ఉద్యాన అధికారి కె.వి.ఎస్.ఎన్ రెడ్డి, రాష్ట్రీయ బాల స్వాస్త్యా కార్యక్రమం జిల్లా సమన్వయ అధికారి డా. ధవళ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.