మాతృ మరణాలు జరిగితే పక్కా విశ్లేషణ ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం మాతృ మరణాల పట్ల జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాతృ, శిశు మరణాలు సంభవించకుండా ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. మాతృ మరణాలు జరుగుటకు సౌకర్యాల లోపమా, వైద్య సేవలలో లోపమా, సామాజిక పరమైన అంశాలు ఉన్నాయా అనే కారణాలను విశ్లేషించాలని ఆయన స్పష్టం చేశారు. ఉప కమిటీ పక్కాగా విచారణ చేయాలని ఆయన ఆదేశించారు. గర్భిణీలు ప్రసవ సమయంలో మృతి చెందితే అందుకుగల నిర్దిష్టమైన కారణం కనుగొనాలని ఆయన స్పష్టం చేశారు. వైద్య సౌకర్యాలు అందుబాటు, క్లినికల్ సౌకర్యాల లభ్యత, సామాజిక విధానంలో జరిగిన తప్పులు విశ్లేషించాలని ఆయన సూచించారు. హై రిస్క్ కేసులకు స్థానిక ఆర్.ఎం.పి వైద్యులు చికిత్స అందించడం పట్ల తీవ్రంగా పరిగణించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కొన్ని మండలాల్లో హై రిస్క్ కేసులకు ఆర్.ఎం.పిలు ఐ.వి. ఫ్లూయిడ్స్ ఇవ్వడంతో గర్భిణీల ఆరోగ్య పరిస్థితుల్లో విపరీతమైన మార్పులు వచ్చి మరణాలు సంభవిస్తున్నట్లు ఏ.ఎన్.ఎం, ఆశా కార్యకర్తలు వివరించడం పట్ల జిల్లా కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. ప్రసవాలకు వచ్చే వారి రక్తపు గ్రూప్ ముందుగా పి.హెచ్.సి స్థాయిలో గుర్తించి జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారికి తెలియజేయాలని ఆయన అన్నారు. అవసరం మేరకు రక్తపు యూనిట్లు సిద్ధం చేయాలని ముఖ్యంగా నెగిటివ్ బ్లడ్ గ్రూప్ పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఇప్పటి వరకూ చికిత్స అందించిన నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వ్యక్తుల వివరాలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. అటువంటి కుటుంబ సభ్యులను రక్త దానానికి విజ్ఞప్తి చేయాలని ఆయన సూచించారు.
*రక్త దానానికి ముందుకు రావాలి* :
ప్రసవ సమయంలో అవసరమగు రక్తపు యూనిట్లు, ముఖ్యంగా నెగిటివ్ బ్లడ్ గ్రూప్స్, అందుబాటులో ఉండక పోవడంపై జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ స్పందిస్తూ యువత రక్త దానానికి ముందుకు రావాలని కోరారు. రక్త దానం ప్రాణ దానమని గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. రక్త దాతలు నిజమైన హీరోలు అని అన్నారు. రక్త దాతలు తమ పేర్లను జిల్లా ఆసుపత్రిలో నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. జిల్లా ఆసుపత్రిలో ఇందుకు ప్రత్యేక కౌంటర్ ను శని వారం ఏర్పాటు చేయడం జరుగుతోందని ఆయన వివరించారు. ప్రత్యేక కౌంటర్ వద్ద పేరు, ఫోన్ నంబరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు ముందుకు వచ్చి సహకరించాలని, ప్రాణాలు కాపాడాలని కోరారు.
*క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలి*
పి.హెచ్.సి వైద్యులు, క్షేత్ర స్థాయి వైద్య సిబ్బంది గ్రామాల్లో గర్భిణీల ఆరోగ్యం పట్ల పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. హై రిస్క్ కేసులకు ఆర్.ఎం.పిలు చికిత్స చేయరాదని ఆయన స్పష్టం చేశారు. అటువంటి చికిత్స అందించేవారిపై కేసులు నమోదు చేయడం జరుగుతోందని ఆయన అన్నారు. ప్రసవ సమయంలో ఉన్న గర్భిణీల ఆరోగ్యం పట్ల అత్యంత జాగరూకత ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ప్రాణాలతో చెలగాటం వద్దని ఆయన సూచించారు.
*ప్రాంతాలను గుర్తించండి - అవగాహన కల్పించండి*
మూడు కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన కుటుంబాలను గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. గుమ్మలక్ష్మీ పురం మండలంలో ఒక గ్రామంలో 30 సంవత్సరాల వయస్సులో 8వ కాన్పులో మృతి చెందినట్లు గుర్తించారు. దీనిపై స్పందిస్తూ ఇటువంటి అభ్యర్థులను మండలాల వారీగా గుర్తించాలని సూచించారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని, దానిని నివారించాలని ఆయన ఆదేశించారు. ఇటువంటి ప్రాంతాలను గుర్తించి, కుటుంబ నియంత్రణ చికిత్సలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. బగాది జగన్నాథ రావు మాట్లాడుతూ జిల్లాలో 11 మాతృ మరణాలు సంభవించాయని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా.బి.వాగ్దేవి, వైద్య శాఖ అధికారులు ధవళ భాస్కరరావు, అనిల్, టి. జగన్మోహన రావు, సి.హెచ్.విజయ కుమార్, జిల్లా మహిళ శిశు సంక్షేమ అధికారి గొల్ల వరహాలు, తదితరులు పాల్గొన్నారు.