స్వచ్ఛంద సంస్థలు ఉన్నత స్థితికి ఎదగాలి..


Ens Balu
2
Srikakulam
2020-09-22 20:11:05

శ్రీకాకుళం జిల్లాలో నాబార్డ్ అందించే ప్రోత్సాహం, ఆర్ధిక సహాయంతో జిల్లాలోని స్వచ్చంధ సంస్థలు ఆయా రంగాల్లో ఎంతో ఉన్నతస్థితికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ యన్.జి.ఓలకు పిలుపునిచ్చారు. నూతన కేంద్రీకృత ప్రాయోజిత పథకాన్ని జిల్లాలో సమర్ధవంతంగా అమలుచేయడంపై జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం మంగళవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలుత జిల్లాలోని స్వచ్చంధ సంస్థలు ద్వారా చేపడుతున్న పథకాల వివరాలు తెలుసుకున్న ఆయన జిల్లాలో మరిన్ని నూతన కార్యక్రమాలను చేపట్టి ఉపాధికల్పిస్తూ ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నాబార్డ్ ద్వారా అందించే నూతన కేంద్రీకృత ప్రాయోజిక పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ పథకం క్రింద అధిక మొత్తంలో రుణాలను పొందవచ్చని, తద్వారా మీ సంస్థల ద్వారా వ్యాపారాభివృద్ధి చేసుకోవచ్చని సూచించారు. రుణాలను అన్ని జాతీయ బ్యాంకుల ద్వారా పొందే అవకాశం ఈ పథకం ద్వారా కల్పించబడిందని, రుణాల చెల్లింపునకు గరిష్ట పరిమితిని కూడా పెంచిన సంగతిని కలెక్టర్ గుర్తుచేసారు. ముఖ్యంగా రైతుల వ్యవసాయ మౌళిక సదుపాయాలకు మద్ధతుగా ఈ నిధిని రూపొందించినందున వాటిపై దృష్టి సారించాలని కలెక్టర్ చెప్పారు. తద్వారా వ్యవసాయోత్పత్తులను పెంచుకొని మార్కెటింగ్ చేయడం ద్వారా తీసుకున్న రుణాలు సద్వినియోగం కావడమే కాకుండా ఉపాధికల్పన జరుగుతుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఈ పథకం క్రింద పంటలు పండించమే కాకుండా అవసరమైన గొదాములను కూడా సిద్ధం చేసుకోవాలని సూచించారు. నాబార్డ్ డి.డి.ఎం మిళింద్ చౌషాల్కర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఆత్మ నిర్బర్ భారత్ కార్యక్రమం క్రింద 1 లక్ష కోట్ల రూపాయలను వ్యవసాయ మౌళిక సదుపాయల నిధిని ప్రకటించిందని, రైతులకు వ్యవసాయ మౌళిక సదుపాయాలకు మద్ధతుగా ఈ నిధిని రూపొందించినట్లు వివరించారు. ఇందులో పంట కోత నిర్వహణ మౌళిక సదుపాయాల కోసం ఆచరణీయ ప్రోజెక్టుల కోసం మధ్యస్థ – దీర్ఘకాలిక రుణ సదుపాయాన్ని సమీకరించడం, వ్యవసాయ ఆస్తులను సృష్టించడం జరుగుతుందని చెప్పారు. ఈ పథకం 2020-21 నుండి 2029-30వరకు అమల్లో ఉంటుందని అన్నారు. ఈ రుణాల చెల్లింపునకు గరిష్టంగా రెండేళ్లు వ్యవధి ఉంటుందని,సబ్సిడీ కూడా అధికంగా ఉంటుందన్నారు. స్వచ్చంధ సంస్థలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.  ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, యల్.డి.ఎం జి.వి.బి.డి.హరిప్రసాద్, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి డి.సత్యనారాయణ, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్, ఏ.పి.ఎం.ఐ.పి పథక సంచాలకులు  ఎ.వి.యస్.వి.జమదగ్ని, ఆత్మ పథక సంచాలకులు కె.కృష్ణారావు, కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ డా. డి.చిన్నంనాయుడు,  మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు బి.శ్రీనివాసరావు, ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు ఆర్.వి.వి.ప్రసాద్, ఉద్యానవన అధికారి పి.స్వాతి, జిల్లా సహకార అధికారి ఎ.వి.రమణమూర్తి, పలు స్వచ్చంధ సంస్థల సంచాలకులు, ముఖ్య కార్యనిర్వహణాధికారులు  యం.ప్రసాదరావు, యన్.సన్యాసిరావు, పడాల భూదేవి, కైలాస్ సాహు, ఆర్.శర్వాణి, బి.శంకరరావు తదితరులు పాల్గొన్నారు.