విశాలాంధ్ర బుక్ హౌస్ అనేక సంవత్సరాల నుంచి జ్ఞాన కేంద్రంగా వెలుగుతోందని, మంచి పుస్తకం కావాలంటే విశాలాంధ్రకు వెళ్లాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సూచించారు. విశాలాంధ్ర బుక్ హౌస్ ఏర్పాటుచేసిన ఒకటవ పుస్తక మహోత్సవాన్ని మంత్రి అమర్నాథ్ ఆదివారం ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల చరిత్రలను తెలుగులోకి అనువదించిన ఏకైక సంస్థ విశాలాంధ్ర అని అన్నారు. ఆకలి గురజాడ అప్పారావును వెలుగులోకి తెచ్చింది విశాలాంధ్ర సంస్థయే అని అమర్నాథ్ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సాహిత్యం, తెలుగు భాష, సంస్కృతి విస్తరణలో విశాలాంధ్ర చేసిన కృషి అమోఘమని అని రాష్ట్ర భారీ పరిశ్రమలు మరియు ఐటి శాఖ మంత్రి అన్నారు. విశాలాంధ్ర ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి అన్ని రకాల పుస్తకాలను ఓకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమని, ఇలాంటి ప్రదర్శనలు మనిషి విజ్ఞానాన్ని పెంపొందించేందుకు దోహదపడుతాయని అన్నారు. తాను మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించక ముందు ఈ విశాలాంధ్ర బుక్ హౌస్ కి వచ్చేవాడినని ఇక్కడ అనేక అంశాలకు సంబంధించిన పుస్తకాలను కొనుగోలు చేసే వాడినని అమర్నాథ్ గుర్తుచేసుకున్నారు.
తెలుగు సాహిత్యంతో పాటు ఆంగ్ల పుస్తకాలు కూడా ప్రదర్శనలో లభ్యమౌవడం అభినందనీయమని అన్నారు. విశాలాంధ్ర బుక్ హౌస్ ప్రాంగణాన్ని ద్వారకనగర్ పరిసర ప్రాంతానికి తరలిస్తే పాఠకులకు మరింత చేరువయ్యే ఆవకాశం ఉందని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి అమర్నాథ్ హామీ ఇచ్చారు.
ఈ సభకు అధ్యక్షత వహించిన సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ మంత్రి గుడివాడ అమరనాధ్ విశాలాంధ్ర విస్తరణకు చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో విశాలాంధ్ర అంత మొత్తంలో వనరులు సమకూర్చే పరిస్థితి లేదని చెప్పుతూ ప్రభుత్వమే చొరవ తీసుకొని వి ఎం ఆర్ డి ఎ కాంప్లెక్స్ లో తక్కువ మొత్తంలో దుకాణం కేటాయిస్తే ఉపయోగం ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి అమర్నాథ్ సానుకూలంగా స్పందించారు. మంత్రి సానుకూలంగా స్పందించారు. సాహిత్య విస్తరణ ప్రస్థానంలో విశాలాంధ్ర చేసిన కృషికి ఫలితంగా వైస్సార్ జీవిత సాఫల్య పురష్కారం రాష్ట్ర ప్రభుత్వంచే అందుకుందని గుర్తు చేశారు. ఉత్తరాంద్ర కవుల రచనలను వెలుగులోకి తీసుకురావాడానికి విశాలాంధ్ర ప్రముఖ పాత్ర పోసించిందని అన్నారు.
కేజీహెచ్ పర్యవేక్షణ అధికారి డాక్టర్ పి.మైధిలి మాట్లాడుతూ విశాలాంధ్ర తో చాలాకాలం నుంచి అనుబంధం ఉందని, సాహిత్య ప్రస్థానంలో విశాలాంధ్ర చేసిన కృషిని ప్రత్యేకంగా కొనియాడారు. హిందూ దినపత్రిక బ్యూరో చీఫ్ సుమిత్ భట్టాచార్జీ మాట్లాడుతూ పాతనగరంలో విశాలాంధ్ర కేరాఫ్ అడ్రస్ గా ఉండేదని, భాష, సంస్కృతి, సంప్రదాయం, సాహిత్య విలువలు పెంపొందించేందుకు, పాఠకులకు సాహిత్యాన్ని చేరవేయడంలో విశాలాంధ్ర చేసిన కృషి అద్వితీయమన్నారు.
కార్యక్రమంలో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ మేనేజర్ టి. మనోహర్ నాయుడు,సీపీఐ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ ఎ జె స్టాలిన్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు,కార్యవర్గ సభ్యుడు కసిరెడ్డి సత్యనారాయణ, స్థానిక వార్డు కార్పొరేటర్ కోడూరి అప్పలరత్నం, అరసం రాష్ట్ర కార్యదర్శి ఉప్పల అప్పలరాజు,విశాఖ రచయితల సంఘం అధ్యక్షుడు అడపా రామకృష్ణ, బుక్ హౌస్ మేనేజర్ పి ఎ రాజు తదితరులు పాల్గొన్నారు.