సివిల్ సర్వీస్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి..
Ens Balu
2
కలెక్టరేట్
2020-09-22 20:25:19
విశాఖజిల్లాలో అక్టోబరు 4న యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు. మంగళవారం నాడు స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఈ పరీక్షల నిర్వహణ పై తొమ్మిది మంది రూట్ అధికారులు ,27 మంది వెన్యూ సూపర్ వైజర్లు, 27 మంది స్థానిక తనిఖీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్షలను యు పి ఎస్ సి నిబంధనల ప్రకారం విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు. గైడ్ లైన్స్ ను క్షు ణ్ణం గా అధ్యయనం చేసి అమలు చేయాలని కోరారు. ఇద్దరు సీనియర్ ఐ ఎ ఎస్ అధికారులు, యు పి ఎస్ సి తనిఖీ అధికారి పరీక్షలను పర్యవేక్షిస్తారని తెలిపారు. జిల్లాలో 10,796 మంది అభ్యర్దులు 27 కేంద్రాలలో పరీక్ష వ్రాస్తారని తెలిపారు. పరీక్షా కేంద్రాల సూపర్ వైజర్లు , స్థానిక తనిఖీ అధికార్లు,ఇన్విజి లేటర్లు, ఎగ్జామ్ మెటీరియల్ ను తీసుకు వెళ్లడంలోను , పరీక్ష అనంతరం తిరిగి పంపించడంలోను జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు.
పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని , ఎగ్జామ్ మెటీరియల్ ను పరీక్షా కేంద్రాలకు చేర్చడానికి తిరిగి పోస్టు ఆఫీసు నుండి డిల్లీకి పంపేటప్పుడు ఎస్కార్ట్ ను ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ ను కోరారు. త్రాగునీరు సౌకర్యం కల్పించాలని , పరీక్షా కేంద్రాలను శానిటైజ్ చేయాలని జి.వి.ఎం .సి అధికారులను కోరారు. అంతరాయం లేకుండా విద్యుత్తు సౌకర్యం కల్పించాలని ఈ పి డి సి ఎల్ ను కోరారు. ఆర్టీసి సంస్థ అక్టోబరు 3,4 తేదీలలో రైల్వే స్టేషన్, ఆర్టీసి కాంప్లెక్స్ నుంచి పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక బస్సులను నడపాలని తెలిపారు. తపాలా శాఖ పరీక్ష అనంతరం మెటీరియల్ ను పంపించేందుకు తగు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. కోవిడ్ నిబంధనల ప్రకారం పరీక్షా కేంద్రాల వద్ద మాస్క్ లు , శానిటైజర్లు, థర్మల్ స్క్రీనర్లు, పల్స్ ఆక్సీ మీటర్లు, పి పి ఇ కిట్లు అందుబాటులో ఉంచాలని డి ఎం అండ్ హెచ్ ఓ ను కోరారు. జిల్లారెవెన్యూ అధికారి ఆద్వర్యంలో కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతకు ముందు జాయింట్ కలెక్టర్ ఎం .వేణుగోపాలరెడ్డి పరీక్షల నిర్వహణపై యు పి ఎస్ సి నిబంధనలను వివరించారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ ప్రసాద్, సబ్ కలెక్టర్ ఎన్. మౌర్య, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.