జిల్లాలో నేటి నుంచి ఇంటింటా కుష్టువ్యాధి సర్వే


Ens Balu
14
Parvathipuram
2022-11-15 13:00:12

కుష్టు వ్యాధి నివారణపై నవంబరు 15 నుండి డిసెంబరు 5వ తేదీ వరకు ఇంటింటి సర్వే నిర్వస్తున్నట్టు పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. బగాది జగన్నాథ రావు చెప్పారు. జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం సర్వే నిర్వహణపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో సోమ వారం కర పత్రంను ఆవిష్కరించారు. సర్వేలో ఆశా వర్కర్లు, ఏ.ఎన్.ఎం, పురుష వాలంటీర్లు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించాలని తెలిపారు. చర్మంపై స్పర్శలేని మచ్చలు ఉన్నవారు, కనుబొమ్మలు, రెప్పల వెంట్రుకలు రాలిపోవడం, కనుబొమ్మలు మూతపడటం లాంటివి ఎవరికైనా ఉంటే వారు స్వచ్చందంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి, ఆరోగ్య కేంద్రంకి వచ్చి వివరాలను అందించాలని అన్నారు. కుష్టు వ్యాధి సులభంగా అంటుకునే అంటు వ్యాధి కాదని, ఇది చర్మానికి, నాడీ వ్యవస్థకు సంబంధించి దీర్ఘకాలిక వ్యాధి అని వివరించారు. క్షయ వ్యాధికి  కారకమైన మైక్రో బాక్టీరియా వల్ల కుష్టు వ్యాధి వస్తుందని చెప్పారు. వైద్య శాస్త్రం ఎంతో అభివద్ధి చెందినా ఇంకా సమాజంలో కుష్టు వ్యాధిగ్రస్తుల పట్ల నిరాదరణ కొనసాగుతూనే ఉందని, పూర్వకాలంలో ఈ వ్యాధికి సరైన మందు ఉండేది కాదని వివరించారు. 1873 లో హన్సన్‌ అనే నార్వే శాస్త్రవేత్త ఈ వ్యాధికి కారకమైన సూక్ష్మజీవిని కనుగొన్నాడని తెలిపారు. దీని వలన శాశ్వతమైన అంగవైకల్యం కలుగుతుందన్నారు. ప్రాథమిక దశలోనే వైద్యులను సంప్రదించాలని వివరించారు. జాతీయ కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా కుష్టు వ్యాధి చర్మం అసలు రంగు కంటే ముదురు లేదా లేత రంగులో ఉండే  మచ్చల ద్వారా ఈ వ్యాధిని గుర్తిస్తారన్నారు. ఈ వ్యాధిని నిర్ధారించడానికి చర్మ లేదా నరాల బయాప్సీ చేసి వ్యాధిని నిర్దారించవచ్చని ఆయన పేర్కొన్నారు. వ్యాధిని అదుపుచేయుటకు యం.డి.టి మందులను ఆరోగ్య కార్యకర్తలు ఉచితంగా పంపిణీ చేస్తారని, వాటిని వాడవచ్చని చెప్పారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ బాల స్వాస్త్య కార్యక్రమం జిల్లా సమన్వయ అధికారి ధవళ భాస్కరరావు., డా.వినోద్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.