ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలు రూ.2.38 కోట్లు మంజూరు


Ens Balu
10
Kakinada
2022-11-16 13:47:08

పరిశ్రమలకు సంబంధించి   30 దరఖాస్తులకు సంబంధించి వివిధ పరిశ్రమల ప్రోత్సాహకాల కింద రూ. 2.38 కోట్లు మంజూరు చేయడం జరిగిందని కాకినాడ జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా తెలిపారు. బుధవారం సాయంత్రం కాకినాడ కలెక్టరు కార్యాలయంలో జిల్లా కలెక్టరు డా. కృతికా శుక్లా.. పరిశ్రమలు, ఎపీఐఐసీ, గ్రౌండ్ వాటర్, ట్రాన్స్ పోర్టు, అగ్నిమాపక, పంచాయతీ, ఫ్యాక్టరీస్, ట్రాన్స్ కో, లీడ్ బ్యాంకు తదితర శాఖలతో కలిసి జిల్లాస్థాయి పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. గత నెల జరిగిన సమావేశంలో తీర్మానించిన అంశాలకు సంబంధించి తీసుకున్న చర్యలపై కమిటీ తొలుత చర్చించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో నూతన పరిశ్రమల స్థాపనకు ఏక గవాక్ష విధానంలో వచ్చిన 23 దరఖాస్తులలో 15 దరఖాస్తులను కమిటీ ఆమోదించడం జరిగిందన్నారు. ఇందులో 1 దరఖాస్తును తిరస్కరించగా 7దరఖాస్తులు వివిధ దశల్లో ఉన్నాయని కలెక్టరు తెలిపారు.

అదేవిధంగా  ఎంఎస్ఎంఈ లకు సంబంధించి 30 దరఖాస్తులు గాను 2.38 కోట్ల రూపాయలు మంజూరు చేయగా ఇందులో జగనన్న బడుగు వికాసం పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ. 2.08కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టరు అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉన్న 59 పరిశ్రమలకుగాను ఇప్పటి వరకు 51 పరిశ్రమల్లో తనిఖీలు పూర్తి చేయడం జరిగిందని కలెక్టరు తెలిపారు. జిల్లాలో వివిధ పరిశ్రమల స్థాపనకు సంబంధించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం టి.మురళి, ఏడీ కె.కృష్ణారావు, ఎపీఐఐసీ జేడ్ఎం బి.హరిధర్ రావు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి జే.రంగలక్ష్మిదేవి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డి.రాథాకృష్ణ, ఎల్డీఎం సీహెచ్ఎస్వి.ప్రసాదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ ఎన్. అశోక్, గ్రౌండ్ వాటర్, ఎలక్ట్రిసిటీ ఇంజనీరింగ్ అధికారులు, ఇండస్ట్రీస్ ప్రతినిధులు  ఇతర అధికారులు హాజరయ్యారు.