పుస్తక పఠనం-విజ్ఞాన భాండాగారం..డిఈఓ


Ens Balu
16
Parvathipuram
2022-11-17 10:36:19

పుస్తక పఠనం  విద్యార్థులకు విజ్ఞాన భాండాగారమని జిల్లా విద్యాశాఖాధికారి డా.ఎస్.డి.వి.రమణ అన్నారు. గురువారం గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా  స్థానిక డి.వి.ఎం. ప్రభుత్వ మున్సిపల్ స్కూల్ లో రాష్ట్ర గ్రంధాలయ సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ  గ్రంధాలయాలలో పుస్తకాలు చదివి గొప్ప స్థాయికి వెళ్లారని అన్నారు. పేదరికంలో పుట్టిన అబ్రహం లింకన్ కు ఎనిమిదో ఏటనే  అరేబియన్ నైట్స్, వెబ్  డిక్షనరీ ఇచ్చి చదవమని చెప్పిందని, అలా చదవడం మొదలు పెట్టిన లింకన్  అమెరికా అధ్యక్షుడు  అయ్యే వరకూ చదువుని ఎక్కడా అపలేదన్నారు. మనలో ఆలోచన మొదలైతే పని పూర్తి అవుతుందని, పని చేసుకుంటే  అలవాటు అవుతుందని, అలవాటే మన వ్యక్తిత్వం అవుతుందని అన్నారు. వ్యక్తిత్వం మన భవిష్యత్ నిర్ణయిస్తుందని వివరించారు. మనకు విద్య నేర్పిన గురువు ఎక్కడ కనబడిన నమస్కరించాలని, గురువు పట్ల శిష్యుడు ఎలా ఉండాలో వశిష్ఠుడు రాముడుకి  నేర్పించాడని తెలిపారు. అలానే విద్యార్థులు ప్రతీ రోజు పాఠశాలకు వచ్చే ముందు తల్లిదండ్రులకు నమస్కరించి పాఠశాలకు వస్తే మంచిదన్నారు.

అమ్మ చేతి వంట తింటే  మనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావని అన్నారు. విద్యార్థులు ప్రతీ రోజు పేపర్ చదవడం వలన మేధస్సు మెరుగు పడుతుందన్నారు. చదవడం వల్ల  మానసిక ఉల్లాసంతో పాటు విషయ పరిజ్ఞానం కూడా పెరుగుతుందన్నారు. చదవలేను అనే ఆలోచన మానేసి , పై స్థాయికి వెళ్ళాలి అనే లక్ష్యం పెట్టుకుని  చదవాలని విద్యార్థులకు సూచించారు.  కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన బెలగాం భీమేశ్వరరావు, నారంశెట్టి ఉమామహేశ్వర రావు స్ఫూర్తితో కేంద్ర స్థాయిలో పురస్కారాలు సాధించేలా కృషి చేయాలని తెలిపారు. పాకిస్థాన్ లో ఉండే మాలాలా అనే అమ్మాయి అందరూ చదవాలనే నినదించిందని, టెర్రరిస్టులు  ఆమెని చంపాలని ప్రయత్నిస్తే, వారిని ఎదిరించి పోరాడిందని అన్నారు. ఆమె పట్టుదలకు, కృషికి ప్రపంచంలోనే అత్యుత్తమ నోబెల్ శాంతి బహుమతి వచ్చిందని, విద్యార్థులు కూడా ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. పేదరికం  చదువుకు అడ్డు కాదని  విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆత్మవిశ్వాసంతో చదువుకోవాలని అన్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనల్ని చదివిస్తున్నారని వారి నమ్మకాన్ని నిలబెట్టాలని తెలిపారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలని, వాటిని చేరుకోవడానికి కష్టపడాలని అన్నారు. సెల్ ఫోన్ లపై దృష్టి తగ్గించి, పుస్తకాలపై దృష్టి పెట్టాలని సూచించారు. 

జిల్లా గ్రంధాలయ సంఘం అధ్యక్షులు కె. శివ కేశవ రావు మాట్లాడుతూ గ్రంధాలయ ఉద్యమం 1944 నవంబర్ 14 మొట్టమొదట  చెన్నై లో ఏర్పాటు చేశారని అన్నారు. ప్రజా గ్రంధాలయాలు ఏర్పాటు చేసుకుంటే విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. అబ్దుల్ కలాం చెప్పినట్టు కలలు కనండి వాటిని నెరవేర్చుకోడానికి కృషి చేయండి. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి కి చేరుకోవాలని సూచించారు. ఆడపిల్లలు  దైర్యం గా ఉండాలని తెలిపారు. 

ఈ సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన బెలగాం భీమేశ్వరరావు, నారంశెట్టి ఉమామహేశ్వర రావులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఎల్.రమేష్, పాఠశాల ప్రాధానోపాధ్యాయులు గోవిందరావు, జిల్లా గ్రంధాలయ సంఘం కార్యదర్శి చొక్కాపు శ్రీనివాస రావు,  ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.