ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన పథకం ద్వారా జిల్లాలో మత్స్యపరిశ్రమను అభివృద్ది చేసి, యువతకు ఉపాధి కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. ఈ పథకం ద్వారా జిల్లాలో మత్య్స పరిశ్రమ వృద్దిచేయడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. పిఎంఎంఎస్‌వై పథకం అమలుపై, కలెక్టర్ తన ఛాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, మత్స్యకారుల సామాజిక, ఆర్థిక స్థితగతులను మెరుగు పర్చెందుకు పిఎంఎంఎస్వై పథకాన్ని అమలు చేయడం జరుగుతోందని అన్నారు. 2020-21, 2021-22 సంవత్సరాలకు సంబంధించి, పిఎంఎంఎస్‌వై పథకానికి జిల్లాలో మొత్తం 219 మంది లబ్దిదారులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. సాధారణ అభ్యర్ధులకు 40 శాతం, మహిళలు, ఎస్‌సి, ఎస్‌టి మత్స్యకారులకు 60 శాతం సబ్సిడీని ఇవ్వడం జరుగుతుందన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.10.89 కోట్ల విలువైన ప్రాజెక్టులు, 2021-22 సంవత్సరానికి సంబంధించి రూ.15.01 కోట్ల విలువైన ప్రాజెక్టులకు అనుమతి మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. బయోఫ్లాగ్ విధానంలో చేపల పెంపకం, చేప పిల్లల నిల్వ కేంద్రాలు, సముద్రాలు, నదుల్లో కేజ్ యూనిట్ల ద్వారా చేపల సాగు, ఐస్‌బాక్సులతో మోటార్ సైకిళ్ల పంపిణీ, లైవ్ ఫిష్ విక్రయకేంద్రాలు, ఫిష్ కియోస్క్ లు, చేపల బజార్ల ఏర్పాటు, చేపల విక్రయ వాహనాలు, మూడు చక్రాల వాహనాలు, చేపల పడవలు, పడవలకు జాడ తెలుసుకొనేందుకు అవసరమైన పరికరాల ఏర్పాటు, వివిధ రకాల చేపల విక్రయ కేంద్రాల ఏర్పాటుకు ఈ పథకం క్రింద ప్రతిపాదనలు వచ్చినట్లు వివరించారు. యూనిట్లను త్వరగా ఏర్పాటు చేయించడమే కాకుండా, అవి విజయవంతంగా నడిచేలా అధికారులు సహకరించాలని సూచించారు. ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న యూనిట్లను చూపించి, ఔత్సాహికులకు స్ఫూర్తి కల్గించాలని కలెక్టర్ కోరారు.
ఈ సమావేశంలో మత్స్యశాఖ డిప్యుటీ డైరెక్టర్ ఎన్.నిర్మలాకుమారి, జెడ్‌పి సిఇఓ డాక్టర్ ఎం.అశోక్‌కుమార్, డిఆర్‌డిఏ పిడి ఎ.కల్యాణ చక్రవర్తి, జిల్లా వ్యవసాయాధికారి తారకరామారావు, జిల్లా పశు సంవర్థక శాఖాధికారి డాక్టర్ వైవి రమణ, ఎల్‌డిఎం శ్రీనివాసరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.