సంక్షేమ ప‌థ‌కాల ద్వారా మ‌త్స్య‌కారుల‌కు ఆర్థిక చేయూత‌


Ens Balu
36
Vizianagaram
2022-11-22 01:01:38

ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన వివిధ సంక్షేమ ప‌థ‌కాల ద్వారా మ‌త్స్య‌కారుల‌కు వివిధ రూపాల్లో ఆర్థిక చేయూత ల‌భిస్తోంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి అన్నారు. వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ప‌థ‌కాల‌ను కూడా ప్ర‌వేశ‌పెట్టింద‌ని గుర్తు చేశారు. వేట నిషేధ భృతి, పింఛ‌న్లు, ఆయిల్ స‌బ్పిడీ, కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తోంద‌ని పేర్కొన్నారు. అలాగే ప్ర‌మాదాలు సంభ‌వించినప్పుడు అందజేసే ఆర్థిక స‌హాయాన్ని రూ.5 ల‌క్ష‌ల నుంచి రూ.10 లక్ష‌ల‌కు పెంచింద‌ని వివ‌రించారు. సోమ‌వారం ప్ర‌పంచ మత్స్య‌కార దినోత్స‌వం సంద‌ర్భంగా న‌ర్సాపురం నుంచి రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిర్వ‌హించిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో  క‌లెక్ట‌ర్ వీసీ హాలు నుంచి ఆన్‌లైన్ ద్వారా జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి, ఎమ్మెల్సీ సురేష్ బాబు, మ‌త్స్య శాఖ డీడీ ఎన్.నిర్మలాకుమారి, మ‌త్స్య‌కార కో-ఆప‌రేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ బి. చిన‌ప్ప‌న్న‌తో క‌లిసి పాల్గొన్నారు.

ముఖ్య‌మంత్రి ప్ర‌సంగం అనంత‌రం, ఫిషరీష్ డిడి ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ, మ‌త్స్య‌కారుల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల గురించి వివ‌రించారు. వేట నిషేధ భృతిలో భాగంగా జిల్లాలోని 2944 మ‌త్స్య‌కార కుటుంబాల‌కు రూ.294 లక్ష‌లు అంద‌జేశామ‌ని పేర్కొన్నారు. 2200 మందికి ఫించన్లు అందిస్తున్న‌ట్లు చెప్పారు. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డులు అంద‌జేయ‌టం ద్వారా సీడ్ ఫారం నెల‌కొల్ప‌టం ద్వారా ఆర్థిక లబ్ధి చేకూరుస్తున్నామ‌ని వివ‌రించారు. మ‌త్య్స‌కారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జిల్లా యంత్రాంగం అనేక చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

కార్య‌క్ర‌మంలో మ‌త్స్య కార్పోరేషన్ డైరెక్టర్ ఎం. న‌ర‌సింహులు, మ‌త్స్య‌కార సొసైటీ స‌భ్యులు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.