కాకినాడ కలెక్టర్ వినూత్న ప్రయోగం..స్పందన ఎక్కడంటే


Ens Balu
232
Kakinada
2022-12-03 12:22:48

ఒక జిల్లా కలెక్టర్ మనసు పెడితే ప్రభుత్వ కార్యక్రమాలు అమలు, సంక్షేమ కార్యక్రమాలు తీరు ప్రజల్లో చాలా చక్కగా వుంటుంది. ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం గ్రామస్థాయిలో సచివాలయాల్లో సక్రమంగా జరగడం లేదనే విషయాన్ని ఈఎన్ఎస్ ప్రత్యేక కథనాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లింది. దీనితో స్పందించిన కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా స్పందన కార్యక్రమాన్ని మండల 
కేంద్రాల్లో నిర్వహించడం ద్వారా దానిని పూర్తిస్థాయిలో ప్రజలకు చేరువ చేయాలని భావించారు. అనుకున్నదే తడవుగా ఈ సోమవారం స్పందన కార్యక్రమాన్ని కాకినాడ జిల్లాలోని పెదపూడి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. ఒక్కో వారం ఒక్కో మండలంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా జిల్లావ్యాప్తంగా పర్యటనలు చేసినట్టు ఉండటంతోపాటు, స్పందనపై ప్రజల్లో పూర్తిస్థాయి 
చైతన్యం తీసుకురావాలని కూడా నిర్ణయించారు.

మండలాల్లో స్పందన పెట్టేది ఇందుకే..
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలు 14వేల 5 ఉన్నాయి. నిజంగా ప్రతీరోజూ ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి కాకపోయినా వారానికి ఒకరోజు స్పందన కార్యక్రమం ఏర్పాటు చేసినా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి స్పందన అర్జీలు తగ్గాలి. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చి మూడేళ్లు దాటిపోతున్నా ఇంకా నేటికి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ప్రతీసోమవారం స్పందన అర్జీలు వందల సంఖ్యలో 
వస్తున్నాయి..ఇదేదో ఈఎన్ఎస్ చెబుతున్నమాట కాదు స్పందన దరఖాస్తుల సంఖ్యను ప్రతీ సోమవారం జిల్లా కలెక్టర్లు మీడియా ముఖంగా ప్రకటిస్తున్న సంఖ్యలు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు తొలుత నియోజకవర్గ కేంద్రాల్లో స్పందనను ఏర్పాటు చేశారు. అయినా సచివాలయాల్లో మార్పురాలేదు. గ్రామస్థాయిలోనే స్పందన పూర్తిస్థాయిలో జరగాలంటే మండల స్థాయిలో స్పందన పెడితే తప్పా ఫలితం రాదని భావించిన కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా స్పందనను మండల కార్యాలయాలకు మళ్లించారు.

ఇక సచివాలయ సిబ్బంది కాకమ్మ కబుర్లు చెల్లవు..
కాకినాడ జిల్లాలో జిల్లా కలెక్టర్ మండల కేంద్రాల్లో స్పందన కార్యక్రమాలు నిర్వహిస్తే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖచ్చితంగా స్పందన కార్యక్రమం పెట్టి తీరాలి. లేదంటే జిల్లా కలెక్టర్ ఆదేశాలు అమలు కానట్టుగానే భావించాల్సి వస్తుంది. ఇప్పటికే పలు మార్లు సచివాలయ సిబ్బందికి ఆదేశాలు  జారీచేసినప్పటికీ మార్పురాకపోవడంతో అధికారికంగా జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమాన్ని మండల స్థాయిలో ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహించాలని తలచారు. దీనితో సచివాలయ సిబ్బంది కాకమ్మ కబుర్లు, కల్లబొల్లి మాటలు చెప్పడానికి ఆస్కారం లేకుండా పోతుంది. అంతేకాదు..ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన యూనిఫారంను కూడా ధరించుకు రావాల్సి వుంటుంది. ప్రభుత్వం మంచిగా చెప్పినంతకాలం వినని ప్రభుత్వ సిబ్బంది..జిల్లాల్లో కలెక్టర్లు ఈ తరహా నిర్ణయిం తీసుకుంటే..,అసలు మండల స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్న మండల అధికారుల్లో కూడా చలనం వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి.. చూడాలి కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా మండల స్థాయిలో నిర్వహించే స్పందన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏ తరహా మార్పు తీసుకువచ్చి..ప్రతీసోమవారం నిర్వహించే స్పందనకు అర్జీల సంఖ్యను ఎంతమేరకు తగ్గిస్తుందో..!

సిఫార్సు