రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన రీసర్వే డిప్యూటీ తహసీల్దార్లు ప్రతిష్టాత్మక సమగ్ర భూసర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు, మరింత ప్రణాళికాయుతంగా నిర్వహించేందుకు కృషిచేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా ఆదేశించారు. శనివారం కాకినాడ కలెక్టరేట్ విధానగౌతమి సమావేశ మందిరంలో కాకినాడ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్లు, వీఆర్‌వోలకు జగనన్న శాశ్వత భూ హక్కు, భూసర్వే శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ డా. కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, డీఆర్‌వో కె.శ్రీధర్‌రెడ్డి, కాకినాడ ఆర్‌డీవో బీవీ రమణ, సర్వే ఏడీ బి.లక్ష్మీనారాయణలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ మొదటి దశలో కాకినాడ డివిజన్ పరిధిలో తొలి దశలో 121 గ్రామాలకు సంబంధించి సమగ్ర భూసర్వే రికార్డుల రూపకల్పనను విజయవంతంగా పూర్తిచేసిన రెవెన్యూ, సర్వే అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. బృంద స్ఫూర్తితో, నిబద్ధతతో కష్టపడి అధికారులు పనిచేశారన్నారు. ఇదే స్ఫూర్తితో ఇకపైనా పనిచేసి రీసర్వే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలన్నారు. రీ సర్వే కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన డిప్యూటీ తహసీల్దార్లు నెలలో 15 రోజులు క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పర్యటించాలన్నారు.
అప్పీళ్లను స్వీకరించి ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషిచేయాలన్నారు. ఇకపై ప్రతి నెలలో మొదటి వారం శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నామని.. వివిధ సమస్యల పరిష్కారానికి, కొత్త అంశాలపై అవగాహన పెంపొందించేందుకు ఈ శిక్షణ కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. భూ హక్కు పత్రాల పంపిణీ ప్రక్రియకు సంబంధించి డిసెంబర్ 6న మొదటి కార్యక్రమం పిఠాపురంలో జరగనుందని.. తర్వాత గ్రామాల వారీగా పంపిణీ జరుగుతుందన్నారు. పత్రాల పంపిణీ పూర్తయిన చోట స్టోన్ ప్లాంటేషన్‌కు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. సర్వేకు ముందు, సర్వే సమయంలో, ఆ తర్వాత ప్రతి దశలోనూ అధికారులు అప్రమత్తంగా, సమన్వయంతో పనిచేయాలన్నారు. రైతుల నుంచి ఏ ఫిర్యాదు అందినా క్షుణ్నంగా పరిశీలించి, పరిష్కరించాలని కలెక్టర్ కృతికా శుక్లా సూచించారు. సమావేశంలో కాకినాడ డివిజన్‌లోని తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రీసర్వే డిప్యూటీ తహసీల్దార్లు, వీఆర్‌వోలు పాల్గొన్నారు.