మాజీ సైనికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఎస్.విశ్వనాథన్ అన్నారు. మంగళవారం విశాఖ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సైనిక సంక్షేమ బోర్డు సమావేశం సంబంధిత శాఖల అధికారులు , బోర్డు సభ్యులతో నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కె.ఎస్.విశ్వనాథన్ మాట్లాడుతూ మాజీ సైనికుల కుటుంబాలకు, మరణించిన సైనిక కుటుంబ సంక్షేమానికి ప్రభుత్వం పలు రాయితీలు, ఆర్థిక సహకారం పథకాలు అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వ సేవల్లో మాజీ సైనికులకు ప్రాతినిధ్యం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు . ఇళ్ల స్థలాలు, జీవనోపాధి కోసం ప్రభుత్వం కేటాయించే భూ పంపిణీ త్వరితగతిన జరిగేలా కృషి చేస్తామన్నారు. జిల్లా సైనిక వెల్ఫేర్ అధికారి రూపొందించిన ఎజెండా అంశాలపై చర్చించారు. సైనిక వితంతులు/ కుటుంబ ఆధారితులకు / వికలాంగ సైనికులకు ఇంటి స్థలాల మంజూరు కి సంబంధించి త్వరలోనే కేటాయిస్తామని అన్నారు. మహారాణిపేట లో నున్న సైనిక భవన్ నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు పంపాలని రోడ్లు , భవనాలు డి.ఈ కి సూచించారు.మాజీ సైనికులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలలో భర్తీ వివరాలు గుర్తించాలని అన్నారు.
నగదు బహుమతి పొందిన సైనికులకు సంబంధించి నిధులు మంజూరుకు ఉన్నత అధికారులకు ప్రతిపాదనలు పంపాలన్నారు. జీవీఎంసీ దుకాణాల మంజూరులో 2% రిజర్వేషన్ మాజీ సైనికులకు కల్పించేందుకు కృషి చేయాలని జీవీఎంసీ అధికారికి సూచించారు. అదేవిధంగా పోలీస్ కమీషనర్ కార్యాలయంలో విధిలో నున్న సైనికుల కుటుంబ సభ్యుల కొరకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటుకు పోలీస్ శాఖకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఆర్వో శ్రీనివాస్ మూర్తి, ప్రత్యేక ఆహ్వానితుడు కల్నల్ ఎ . వెంకట రామన్ , అదనపు అధికారి ,స్టేషన్ హెడ్, జి ఎం డి ఐ సి రామలింగేశ్వరరాజు , జిల్లా ఉపాధి అధికారి సుబ్బిరెడ్డి , జిల్లా సైనిక సంక్షేమ అధికారి జి. సత్యానందం, ఆర్ & బి డిఈ ఫణేశ్వరరావు , అధికారిక , అనధికారిక సభ్యులు కల్నల్ ఎస్. భాషా తదితరులు పాల్గొన్నారు.