మన్యం జిల్లాలో విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ


Ens Balu
9
Parvathipuram
2022-12-07 07:34:55

అంటరానితనం,  షెడ్యూలు కులాలు, జాతుల వారిపై  దాడులను నివారించుటకు  జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ  సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టరు కార్యాలయ సమావేశమందిరంలో జిల్లా కలెక్టరు అధ్యక్షతన  జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ  సమావేశంలో జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ మాట్లాడుతూ,  అంటరానితనం, అత్యాచారం, దాడులకు గురయిన బాధితులకు సత్వర న్యాయం, పరిహారం అందించాలన్నారు. జిల్లాలో నూతనంగా ఏర్పాటుచేసిన కమిటీ సభ్యులు సేవాభావంతో పనిచేయాలని తెలిపారు.  కేసులు నమోదులో జాప్యం ఉండకూడదని, కేసు నమోదుకు అవసరమైన ధృవపత్రాలు వెంటనే భాదితులకు అందించాలని అధికారులను ఆదేశించారు.  కేసు చార్జిషీటు ఉన్నతాధికారులకు వెంటనే పంపించాలన్నారు.  డివిజినల్ స్థాయి సమావేశాలు నిర్వహించి కేసులపై సమీక్ష నిర్వహించాలన్నారు. భాధితులకు అత్యదిక పరిహారం అందించాలని, రెండు లేక అంతకంటే ఎక్కువ సెక్షన్ల ప్రకారం పరిహారం అందేఅవకాశం ఉంటే అందించాలని తెలిపారు. సరైన సెక్షన్ల ప్రకారం  కేసునమోదు  చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పరిహారం తో పాటు, కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన డా. అంబేద్కర్ సహాయ నిధినుండి కూడా పరిహారం అందించుటకు ప్రతిపాదనలు పంపించాలని తెలిపారు.  నెలలో ఆఖరి వారంలో ఒకరోజు తహశీల్దార్లు  ఒక గ్రామాన్ని సందర్శించి అంటరానితనంపై  అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజలతో మాట్లాడి వారికి  సమస్యలు ఉంటే తెలుసుకోవాలన్నారు.    పెండింగులో గల కేసుల వారీ వివరాలు, బాదితులకు  అందించిన పరిహారం పై సమీక్షించారు.  బాధితులు మైనర్లయితే బాలల సంక్షేమ కమిటీ వారిని పరామర్శించాలని, తరచు వారిని కలుసుకొని వారికి మనోధైర్యాన్ని కలిగించాలని తెలిపారు. 

అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు డా. ఒ. దిలీప్ కిరణ్ మాట్లాడుతూ  జిల్లాలో నమోదైన కేసులపై త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చార్జిషీటు కాపీలను కలెక్టరు కార్యాలయంనకు మరియు సంబందిత అదికారులకు వెంటనే పంపించాలని తెలిపారు. రిపోర్టును పంపిన పిదప రశీదులను తీసుకొని రికార్డులలో పొందుపరచాలన్నారు. కుల దృవీకరణ సర్టిఫికెట్ నిర్ణీత ప్రొఫార్మా 3 ద్వారా తీసుకోవాలని తెలిపారు. 
జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి మహమ్మద్ గయాజుద్దీన్ మాట్లాడుతూ జి.ఒ. నంబరు 99 ప్రకారం జిల్లాలో జిల్లా కలెక్టరు అద్యక్షత జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఇరవై నాలుగు కేసులు నమోదైనాయని, పదహారు కేసులు విచారణ దశలోను, రెండు కేసులు కోర్టులో ట్రైల్ దశలోను ఉన్నాయని, ఆయ కేసులు సంబంధిత అదికారలకు విచారణ నిమిత్తం పంపించడం జరిగిందని తెలిపారు. బాధితులకు అందించిన  పరిహారం వివరాలను తెలియజేసారు. 

ఈ సమావేశంలో సబ్ కలెక్టరు నూరుల్ కమర్, ఆర్.డి.ఒ. కె.హేమలత, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకటరావు, సబ్ డివిజినల్ పోలీసు అదికారులు ఎ. సుబాష్, జి.వి.కృష్ణారావు, మురళీధర్, సివిల్ సప్లయి జిల్లా మేనేజరు ఎం. దేవుల నాయక్, జిల్లా పశుసంవర్థక అధికారి ఎ. ఈశ్వరరావు, జిల్లా అగ్నిమాపకఅదికారి కె.శ్రీనుబాబు, కమిటీ సభ్యులు గునగంజి చంద్రయ్య, పిరపాక శ్రీనివాసరావు, మెయి లక్మీకుమారి, ఇతర అధికారులు  పాల్గొన్నారు.
సిఫార్సు