సాయుధ దళాలు దేశానికి అందిస్తున్న సేవలు నిరుపమానమని, జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి కొనియాడారు. వారి త్యాగాలు అమోఘమని పేర్కొన్నారు. సాయుధ దళాల పతాక దినోత్సవం కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం ఘనంగా జరిగింది. కలెక్టర్‌కు పతాక నిధి ఫ్లాగ్‌ను జిల్లా సైనిక సంక్షేమాధికారి మజ్జి కృష్ణారావు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, సైనిక దళాల సేవలను కొనియాడారు. మంచు కొండల్లో, పర్వతాల్లో, ఎడారుల్లో, సముద్రంలో, ఎంతో ప్రతికూల వాతావరణం మధ్య, సాయుధ దళాలు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా, అనుక్షణం పహారా కాస్తూ, దేశాన్ని రక్షిస్తున్నాయని అన్నారు. వారి త్యాగాల ఫలితంగానే, మనమంతా దేశంలో ప్రశాంతంగా ఉండగలుగుతున్నామని చెప్పారు.
ఉక్రెయిన్ యుద్ద పరిస్థితుల్లో, వైద్య విద్యార్థులను దేశానికి తిరిగి రప్పించేందుకు పడ్డ ప్రయాసను గుర్తు చేస్తూ, దేశంలోని పౌరులు అనుభవిస్తున్న స్వేచ్చ గొప్పదనాన్ని వివరించారు. సాహసోపేత వీరజవాన్లకు వందనం సమర్పించేందుకు, వారి కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని చెప్పారు. ఈ సందర్భంగా, పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చి, వారి త్యాగాలను గౌరవించాలని పిలుపునిచ్చారు. దేశ రక్షణలో అమరులైన వీరుల త్యాగాలను స్మరించుకుంటూ, గోడపత్రికలను కలెక్టర్ విడుదల చేశారు.
జిల్లా సైనిక సంక్షేమాధికారి మజ్జి కృష్ణారావు మాట్లాడుతూ, పతాక దినోత్సవ నిధికి ఇచ్చే విరాళాలకు ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉదని తెలిపారు. సైనికుల సంక్షేమానికి పెద్ద ఎత్తున విరాళాలను అందించాలని కోరారు. జిల్లా సైనిక సంక్షేమాధికారి, విజయనగరం ఎస్‌బిఐ ఖాతా నెంబరు 52065221666, ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఎస్‌బిఐఎన్0020931 కు గానీ, లేదా డైరెక్టర్, సైనిక్ వెల్ఫేర్, విజయవాడ పేరుమీద చెక్కు లేదా డ్రాఫ్ట్ ద్వారా కూడా తమకు విరాళాలను అందజేయవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎం.గణపతిరావు, మున్సిపల్ కమిషనర్ ఆర్.శ్రీరాములనాయుడు, సహాయ కమిషనర్ ప్రసాదరావు, కెప్టెన్ ఎం.సత్యవేణి, కెప్టెన్ ఎ.కల్యాణ్ ఆహోక్, లెఫ్టినెంట్ వి సన్యాసినాయుడు, హవల్దార్ మహబూబ్ కట్నాట్, మాజీ సైనిక సంక్షేమ సంఘం నాయకులు, పలువురు విశ్రాంత సైనిక యోధులు, ఎన్‌సిసి కేడెట్లు, సచివాలయ సిబ్బంది, బిఎల్ఓలు పాల్గొన్నారు.