సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరాళాలందించండి
Ens Balu
7
Kakinada
2022-12-07 09:11:45
మాజీ సైనికులు, దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన వీర జవానుల కుటుంబాల సంక్షేమం లక్ష్యంగా చేపట్టే కార్యక్రమాలకు ఉద్దేశించిన సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరివిగా విరాళాలు అందించాలని జిల్లా కలెక్టర్, జిల్లా సైనిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ డా. కృతికా శుక్లా ప్రజలకు, వివిధ సంస్థలకు పిలుపునిచ్చారు. బుధవారం భారత సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్.. సాయుధ దళాల పతాక దినోత్సవ నిధి-2022ని ప్రారంభించి, తొలి విరాళం అందించారు. ఆన్లైన్లో విరాళాలు అందించేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ రక్షణకు అహర్నిశలు కృషిచేసిన సైనికుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ వారి కుటుంబాలకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మాజీ సైనికులు, అమరవీరుల కుటుంబాల పరిరక్షణ అందరి బాధ్యతన్న విషయాన్ని గుర్తుంచుకొని, పతాక దినోత్సవ నిధికి విరాళాలు అందించాలని పిలుపునిచ్చారు. దాతలు నేరుగా జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో సంప్రదించిగానీ లేదా Cheque /DD/Cash /Online Transfer చేయొచ్చని తెలిపారు. సైనిక సంక్షేమ నిధి అకౌంట్ వివరాలు: ZILLA SAINIK WELFARE OFFICER, STATE BANK OF INDIA, ZILLA PARISHAD BRANCH A/C No- 6 2 0 6 4 0 6 0 6 2 3, IFSC CODE– SBIN0020974, MICR CODE – 533002028. ఈ విరాళాలకు ఆదాయపు పన్ను నుంచి సెక్షన్ 80 G అనుగుణంగా మినహాయింపు ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా మాజీ సైనికులు సి.ఆర్.సి.ప్రసాద్, ఎం.పి. రామారావు, సీహెచ్ పవన్ కుమార్ (పవన్ కంప్యూటర్స్, కాకినాడ) విరాళాలకు సంబంధించిన చెక్కులను కలెక్టర్ కృతికా శుక్లాకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి కెప్టెన్ డాక్టర్ పి.సత్య ప్రసాద్, జిల్లాలోని పలువురు మాజీ సైనికులు పాల్గొన్నారు.