శ్రీకాకుళం జిల్లాలోని మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే క్రిమినల్ కేసులు పెడతామని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ హెచ్చరించారు. సమాజంలో ఉండే లింగ వివక్షకు శాశ్వతంగా ముగింపు పలికి, పురుషులతో సమానంగా సమాజంలో ముందుకువెళ్లాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మహిళలంటే అబలలు కాదని, సబలలని నిరూపించుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. పని ప్రదేశాల్లో మహిళలపై జరుగు లైంగిక వేధింపుల నివారణపై అవగాహన ర్యాలీ ( మారథాన్ ) కార్యక్రమం మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ప్రభుత్వ మహిళల డిగ్రీ కళాశాల వద్ద జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మారథాన్ ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. మహిళా డిగ్రీ కళాశాల వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ సూర్యమహల్ జంక్షన్ వరకు కొనసాగింది. అనంతరం మానవహారం ఏర్పాటుచేసి మహిళల లైంగిక వేధింపుల నివారణపై ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పని ప్రదేశాల్లో మహిళలపై జరుగు లైంగిక వేధింపుల నివారణపై గత నెల 26 నుండి ఈ నెల 10వ తేది వరకు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నట్లు చెప్పారు. జిల్లా యంత్రాంగం తరపున జిల్లా అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో సమావేశం కూడా ఏర్పాటుచేసుకున్నామని తెలిపారు. జిల్లాలోని ప్రతి పాప సురక్షితంగా ఉండాలని, వారు సమాజంలో ఉన్నపుడు అబల అనే భావన కాకుండా సబల అనే భావం రావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. మహిళలు పనిచేస్తున్న ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురైతే తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని, లేనిచో పై అధికారులను సంప్రదించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. లైంగిక వేధింపులకు ఎవరైనా పాల్పడితే జిల్లా కలెక్టర్, జిల్లా యస్.పి, మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి లేదా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులను సంప్రదించవచ్చని కలెక్టర్ వివరించారు.
జిల్లాలో యస్.పి, డిఎంహెచ్ఓ, మహిళ, శిశు సంక్షేమాధికారులు మహిళలు కావడం మన అదృష్టమని, బాధితులు ఎవరైనా ఉంటే వారికి వివరంగా తెలియజేయవచ్చని కలెక్టర్ స్పష్టం చేసారు. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, చట్టాలకు లోబడి క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. మహిళలు ప్రతి విషయంలో పురుషులతో సమానంగా ఉంటూ సమ సమాజంలో ముందుకు వెళ్లాలని కలెక్టర్ ఆకాంక్షించారు. మహిళల లైంగిక వేధింపుల నివారణపై రూపొందించిన గోడ పత్రికను ఇతర అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ మారథాన్ కార్యక్రమంలో జిల్లా అదనపు యస్.పి టి.పి.విఠలేశ్వర్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు డా. డి.వి.విద్యాసాగర్, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖాధికారి కె.అనంతలక్ష్మీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి.మీనాక్షి, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణాధికారి ఆర్.వెంకట రామన్, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.