డా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో సేవలందేలా కృషిచేయాలని.. ఫిర్యా దులను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కోర్టుహాల్‌లో కలెక్టర్ కృతికా శుక్లా అధ్యక్షతన జిల్లా క్రమశిక్షణ కమిటీ (డీడీసీ) సమావేశం జరిగింది. డా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం జిల్లాలో అమలుతీరు, అందుబాటులో ఉన్న ఆరోగ్య మిత్రలు, టీం లీడర్లు, అర్జీల స్వీకరణ, పరిష్కార వ్యవస్థ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ, నెట్‌వర్క్ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందించే వ్యవస్థలో ఎవరైనా అవకతవకలకు పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
కాకినాడ జిల్లాలో 84 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ కింద ఆమోదం పొంది ఉన్నాయని, ఈ ఆసుపత్రుల్లో 79 మంది ఆరోగ్యమిత్రలు పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఆరోగ్య మిత్రలకు సంబంధించి ఖాళీలు ఏవైనా ఉంటే వెంటనే భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ చర్యల ద్వారా ఆరోగ్యశ్రీ సేవల వ్యవస్థను పటిష్టం చేయొచ్చన్నారు. ప్రతి నెల మొదటి బుధవారం డిస్ట్రిక్ డిసిప్లినరీ కమిటీ సమావేశాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశాలు ఫలప్రదంగా జరిగేందుకు వీలుగా నెలవారీగా సవివర నివేదికలను అందుబాటులో ఉంచాలన్నారు. గ్రామ స్థాయిలో ఏఎన్ఎంలకు ఆరోగ్యశ్రీ సేవలు, ప్రత్యేక యాప్‌పై అవగాహన కల్పించాలన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలోనూ ప్రత్యేకంగా నోడల్ సిబ్బందిని నియమించాలని సూచించారు. డా. వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించిన సమాచారాన్ని పోస్టర్ల రూపంలో ప్రదర్శించాలన్నారు. 104, స్పందన, ఐవీఆర్ఎస్, వ్యక్తిగత మార్గాల ద్వారా అందే ఫిర్యాదులను, అర్జీలను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా గ్రీవెన్సుల పరిష్కారం ఉండాలని కలెక్టర్ కృతికాశుక్లా స్పష్టం చేశారు. సమావేశానికి డీఎంహెచ్‌వో డా. ఎం.శాంతిప్రభ, కమిటీ సభ్యులు డా. ఎస్.చక్రరావు, ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త డా. పి.రాధాకృష్ణ, ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్ కె.నవీన్ తదితరులు హాజరయ్యారు.