అవినీతికి తావులేకుండా పథకాలు, కార్యక్రమాలు లబ్ధిదారులకు అందేందుకు అధికారులు కృషిచేయాలని ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ ఛైర్మన్ సీహెచ్ విజయప్రతాప్‌రెడ్డి అన్నారు. బుధవారం ఫుడ్ కమిషన్ ఛైర్మన్ సీహెచ్ విజయప్రతాప్‌రెడ్డి.. కమిషన్ సభ్యులు జె.కృష్ణకిరణ్, పౌర సరఫరాలు, ఐసీడీఎస్, విద్య తదితర సమన్వయ శాఖల అధికారులతో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. కాకినాడ అర్బన్ కచేరిపేటలో ఎండీయూ వాహనం ద్వారా ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్న తీరును పరిశీలించారు. ప్రజలకు పంపిణీ చేస్తున్న బియ్యం, కందిపప్పు తదితర సరుకుల నాణ్యతను పరిశీలించారు. కాకినాడ జగన్నాథపురంలో ఎ.శ్రీనివాసరావుకు చెందిన చౌక ధరల దుకాణాన్ని, అన్నమ్మఘాటిలో ఎంవీవీ సత్యనారాయణ చౌక ధరల దుకాణాన్నిఛైర్మన్ తనిఖీ చేశారు.
కరప మండలం, పెనుగుదురు గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని, మండల ప్రజా పరిషత్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరపలోని శ్రీ నక్కా సూర్యనారాయణ మూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వండుతున్న మధ్యాహ్న భోజనాలను, సరుకుల నాణ్యతను పరిశీలించి పాఠశాల విద్యార్థులకు ఫోర్టిఫైడ్ బియ్యం ప్రాధాన్యం, పోషక విలువలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. వేలంగిలోని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఎంఎల్ఎస్ పాయింటును సందర్శించి బియ్యం బస్తాలు, కందిపప్పు నిల్వను పరిశీలించి హమాలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గురజానపల్లి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. పౌష్టికాహారం అందించే ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, మధ్యాహ్న భోజనం పాఠశాలలో చేయాలని సూచించారు. చివరిగా జగన్నాధపురం సెంటర్లో ఉన్న బచ్చు రామం నగరపాలక సంస్థ బాలికోన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం నాణ్యతను పరిశీలించి విద్యార్థులకు పోషక విలువలు కలిగిన ఫోర్టిఫైడ్ బియ్యంపై అవగాహన కల్పించారు.
ఈసందర్భంగా విజయ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రతా చట్టం-2013 పరిధిలో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ ఏర్పడిందని.. ఈ కమిషన్‌కు తాను రెండో ఛైర్మన్‌గా పనిచేస్తున్నానని తెలిపారు. 2022, మార్చిలో బాధ్యతలు స్వీకరించిన దగ్గరి నుంచి ఇప్పటి వరకు 475 వరకు కేంద్రాలను సందర్శించినట్లు వెల్లడించారు. పౌర సరఫరాల వ్యవస్థ ఆహార ధాన్యాల పంపిణీ, మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీ కేంద్రాలు, సంక్షేమ హాస్టళ్లతో పాటు ప్రధానమంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై)పై కమిషన్ దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తూ లోటుపాట్లను గుర్తిస్తూ.. సరిదిద్దుతున్నట్లు వెల్లడించారు. పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాల అమల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి అనేది ఉండకూడదని స్పష్టం చేశారు.
అధికారులు, సిబ్బంది నీతినిజాయితీలతో పనిచేయాలని విజయ ప్రతాప్‌రెడ్డి సూచించారు. మంగళవారం కాకినాడ జిల్లాలో పర్యటన ప్రారంభమైందని గురువారం ఉదయం వరకు జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు. ఫుడ్ కమిషన్ ఛైర్మన్ వెంట ఫుడ్ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ పి.సురేష్, సివిల్ సప్లయ్స్ డీఎం డి.పుష్పమణి, జిల్లా పౌరసరఫరాల అధికారి డి.చాముండేశ్వరి, ఏఎస్‌వో టి.ప్రసన్న లక్ష్మీదేవి, ఐసీడీఎస్ పీడీ కె.ప్రవీణ, ఇన్‌ఛార్జ్ డీఈవో ఆర్‌జే డానియల్ రాజు, లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ ఎస్.డి.సలీమ్ తదితరులు ఉన్నారు.