భూముల రీసర్వే నిర్వహిస్తున్నప్పుడు రైతులు దగ్గరుండి తమ భూముల కొలతలు తీయించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి కోరారు. రైతుల సమక్షంలోనే వారి భూములను సర్వే చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూముల రీ-సర్వే ప్రక్రియ ఒక సువర్ణావకాశం లాంటిదని, దీనిని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. దాదాపు వందేళ్ల తరువాత జరుగుతున్న ఈ భూ సర్వే ప్రక్రియ పూర్తయితే, భూ సమస్యలకు, వివాదాలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. జిల్లాలో రీ సర్వే ప్రక్రియ విజయవంతంగా జరుగుతోందని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి దశలో భాగంగా ఇప్పటి వరకు 24 మండలాల్లోని 179 గ్రామాల్లో సమగ్ర భూ సర్వే పూర్తయ్యిందని, సుమారు 11వేల మందికి వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయడం ద్వారా, వారి భూములపై సర్వ హక్కులను కల్పించడం జరిగిందని తెలిపారు. రైతులు అపోహలను విడనాడి, అధికారులకు పూర్తి స్థాయిలో సహకరిస్తే, సమగ్ర భూ సర్వేను మరింత విజయవంతంగా వేగంగా పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. భూ సర్వే నిర్వహిస్తున్నప్పుడు, రైతులు తప్పనిసరిగా తమ భూములవద్ద ఉండి, ప్రక్రియను పూర్తి చేయించుకోవాలని, అక్కడే సందేహాలను నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ కోరారు. దీనికోసం ముందుగానే ఆయా రైతులకు సమాచారం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
రీ సర్వేతో ఎన్నో ఉపయోగాలు
సర్వే వల్ల సాదా బై నామా ద్వారా జరిపిన లావాదేవీలకు శాశ్వత హక్కులు లభిస్తాయని, ప్రభుత్వ, దేవాదాయ భూములకు రక్షణ కలుగుతుందని పేర్కొన్నారు. ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న జీవితకాల సమస్యలకు ఈ సర్వేద్వారా పరిష్కారం లభిస్తుందని ఉద్ఘాటించారు. ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ రైతులు తిరగాల్సిన పనిలేదని, పైసా ఖర్చు లేకుండా తన ఆస్తికి సర్వ హక్కులూ లభిస్తాయని తెలిపారు. ఈ సర్వే ప్రక్రియ ద్వారా సాగుచేసుకుంటున్న పొలాలతో పాటు 4 లక్షల ఖాతాలకు సంబంధించిన గ్రామ కంఠాలకు, సాదా బై నామా ద్వారా జరిగిన లావాదేవీలకు కూడా సంపూర్ణ హక్కులు లభిస్తాయని వివరించారు. వారసత్వంగా వచ్చిన భూములకు కుటుంబ సభ్యుల సమక్షంలోనే చిటికెలో పరిష్కారం లభిస్తుందన్నారు. సరిహద్దు గొడవులు.. పంపకాల చిక్కులు తొలగిపోతాయని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్జానాన్ని ఉపయోగించి జరుగుతున్న ఈ సర్వే వల్ల భూములకు సంబంధించి ప్రత్యేక ఎల్.పి.ఎం. నంబర్ ద్వారా అన్ని వివరాలు క్యూ ఆర్ కోడ్‌లో నిక్షిప్తమై ఉంటాయని, దీంతో భవిష్యత్తులో సంబంధిత రైతుల అనుమతి లేకుండా పేర్లు గానీ, సరిహద్దులు గానీ మార్చలేరని తెలిపారు. చివరికి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కూడా ఓటీపీ వస్తే గానీ ప్రక్రియ ముగియదన్నారు. అత్యంత కచ్చితత్వం, భద్రతా ప్రమాణాలు పాటిస్తూ 20వేల సర్వే రాళ్లను రైతుల భూముల సరిహద్దుల్లో పాతడం జరిగిందని తెలిపారు.
త్వరలో భూహక్కు పత్రాల పంపిణీ
జిల్లాలో సమగ్ర భూ సర్వే ప్రక్రియలో భాగంగా మొదటి దశ విజయవంతంగా ముగిసిందని, మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 24 మండలాల్లో రీ-సర్వే పూర్తయిందని తెలిపారు. దాదాపు 179 గ్రామాల్లోని 11వేల మంది రైతులకు త్వరలోనే సంబంధిత భూ హక్కు పత్రాలు పంపిణీ చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసిందని తెలిపారు. రెండో దశక్రింద మరో 150 గ్రామాల్లో సర్వే చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, ఫిబ్రవరి ముగిసే నాటికి మరొక 75 గ్రామాల్లో సర్వే ప్రక్రియను పూర్తి చేసేందుకు కార్యాచరణ చేపట్టినట్టు కలెక్టర్ తెలిపారు.